పాక్ జట్టు ఫిక్సింగ్ చేసిందా ? 8 క్యాచ్ లు వదిలేయడంపై డౌట్స్
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్ బెర్తులు ఖారారయ్యాయి. టైటిల్ ఫేవరెట్ రేసులో ముందున్న ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ చేరుకోగా... పాక్ మహిళల జట్టుపై ఘనవిజయంతో న్యూజిలాండ్ కూడా ముందంజ వేసింది.
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్ బెర్తులు ఖారారయ్యాయి. టైటిల్ ఫేవరెట్ రేసులో ముందున్న ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ చేరుకోగా… పాక్ మహిళల జట్టుపై ఘనవిజయంతో న్యూజిలాండ్ కూడా ముందంజ వేసింది. ఊహించని విధంగా 110 పరుగుల స్కోరును కివీస్ వుమెన్ టీమ్ కాపాడుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో పాక్ గెలిచి ఉంటే భారత మహిళల జట్టు సెమీస్ కు చేరి ఉండేది. అయితే పాక్ మహిళా క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భారత్ సెమీస్ కు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే పాక్ ఆడిందని పలువురు ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. మ్యాచ్ ఆరంభం నుంచీ పాక్ ఆటతీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా పేలవమైన ఫీల్డింగ్ తో పాక్ జట్టు మ్యాచ్ ను కివీస్ చేతిలో పెట్టిందన్న వాదన వినిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పాకిస్థాన్ ఎనిమిది క్యాచ్‌లను జారవిడించింది. దీనిలో ఒక్కటి కూడా కష్టమైన క్యాచ్ కాదు. అన్ని సులువైన క్యాచ్‌లే… నేరుగా చేతుల్లోకి వచ్చినా అందుకోలేదు. ఇక ఛేజింగ్ లో వాళ్ల బ్యాటింగ్ అతి దారుణంగా ఉంది. 28 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఇక నాలుగు పరుగుల వ్యవధిలో చివరి అయిదు వికెట్లు చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని నెట్టింట్లో ఆరోపణలు వస్తున్నాయి.
మొదట బ్యాటింగ్ కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 110 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ లో పాకిస్థాన్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఫాతిమా సనా, వికెట్ కీపర్ మునీబా అలీ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటకీ… సింగిల్స్ తీయలేనంత కష్టంగా అయితే లేదు. పాక్ ఓటమితో టోర్నీ నుంచి భారత్ కూడా నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు రెండు మ్యాచ్ లే గెలిచింది. తొలి మ్యాచ్ లో కివీస్ చేతిలోనూ, తర్వాత ఆసీస్ పైనా ఓడిపోవడం మన అవకాశాలను దెబ్బతీసింది.