రోహిత్, షమీ మధ్య గొడవ, అందుకే తీసుకోవడం లేదా ?
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మధ్య అంతా సవ్యంగానే ఉందా.. అంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగిందన్న వార్తలు వైరల్ గా మారాయి.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మధ్య అంతా సవ్యంగానే ఉందా.. అంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగిందన్న వార్తలు వైరల్ గా మారాయి. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు సమయంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో ఉన్న షమిని రోహిత్ కలిశాడని, ఆ సమయంలో ఇద్దరూ మాటామాటా అనుకున్నట్లు జాతీయ మీడియా కథనం తెలిపిందియ న్యూజిలాండ్ తో తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఎన్సీఏలో ఉన్న షమిని కలిసిన తర్వాత రోహిత్ మీడియాతో మాట్లాడాడు. షమి పూర్తి ఫిట్ గా లేడని, అతని మోకాలిలో వాపు ఉన్నట్లు చెప్పాడు. దీంతో షమికి కొత్త గాయం అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై షమి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బెంగళూరు టెస్టులో టీమిండియా ఓడిన తర్వాత మరోసారి షమిని రోహిత్ కలిసిన సందర్భంలో ఇదే వియంపై ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
తన గాయం పరిస్థితి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ కు అందుబాటులో ఉండటంపై మీడియాకు రోహిత్ ఇచ్చిన సమాచారంపై అసంతృప్తిగా ఉన్న షమి అతనితో వాగ్వాదానికి దిగాడని ఎన్సీఏ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. తర్వాత మరోసారి మీడియా సమావేశంలోనూ హిట్ మ్యాన్ షమీ గాయంపై ఆచితూచి స్పందించాడు. అతన్ని తొందరపడి ఇక్కడికి తీసుకురావాలని అనుకోవడం లేదన్నాడు. అతని విషయంలో 100 శాతం కంటే ఎక్కువ కచ్చితత్వం కోసం చూస్తున్నామని చెప్పాడు. అతనిపై ఒత్తిడి పెంచాలని భావించడం లేదనీ. కొందరు ప్రొఫెషనల్స్ అతని పరిస్థితిని గమనిస్తున్నారని వెల్లడించాడు. షమీకి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే మహ్మద్ షమి జట్టులోకి వచ్చేది ఎప్పుడన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం బెంగాల్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న షమీపై బీసీసీఐ వేచి చూసే ధోరణిలో ఉంది. నేషనల్ క్రికెట్ అకాడెమీ నుంచి పూర్తి క్లియరెన్స్ లభించిన తర్వాతే షమికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో మూడో టెస్టుకు షమీ దూరమైనట్టే. అయితే మెల్‌బోర్న్ లో డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుకు మాత్రం షమి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.