ఇలాగేనా ఆడేది ? ఆటగాళ్ళకు గంభీర్ చివాట్లు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది టీమిండియా... అంచనాలకు తగ్గట్టే తొలి మ్యాచ్ లో అదరగొట్టింది. పెర్త్ టెస్టులో కంగారూలను చిత్తు చేసిన భారత్ కు రెండో మ్యాచ్ లో ఆతిథ్య జట్టు కౌంటర్ ఇచ్చింది. మ్యాచ్ గెలిసి సిరీస్ ను సమం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 02:04 PMLast Updated on: Jan 02, 2025 | 2:04 PM

Is This How You Play Gambhir Teases Players

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది టీమిండియా… అంచనాలకు తగ్గట్టే తొలి మ్యాచ్ లో అదరగొట్టింది. పెర్త్ టెస్టులో కంగారూలను చిత్తు చేసిన భారత్ కు రెండో మ్యాచ్ లో ఆతిథ్య జట్టు కౌంటర్ ఇచ్చింది. మ్యాచ్ గెలిసి సిరీస్ ను సమం చేసింది. ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా ఆధిపత్యమే కొనసాగుతోంది. వర్షంతో మూడో టెస్ట్ డ్రాగా ముగియగా.. నాలుగో టెస్టులో మాత్రం భారత్ చేతులెత్తేసింది. బాక్సింగ్ డే టెస్టులో డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటకీ బ్యాటర్ల వైఫల్యం కొనసాగిన వేళ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టు సమాచారం… హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్ళకు గట్టిగానే క్లాస్ పీకాడని తెలిసింది. టీమిండియా ఆటగాళ్ల తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో టీమ్ ప్లాన్స్ ను సరిగ్గా అమలు చేయడంలో విఫలమైనందుకు అందరికీ చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చాలా చేశారని.. ఇకముందైనా జాగ్రత్తగా ఉండాలని గౌతీ టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేసేది ఇలాగేనా అంటూ గట్టిగానే మందలించినట్టు తెలుస్తోంది. ఏ ఒక్క ప్లేయర్ ను టార్గెట్ చేసి మాట్లాడకున్నా…సీనియర్ ఆటగాళ్ళను ఉద్దేశించే గంభీర్ ఈ క్లాస్ తీసుకున్నట్టు జాతీయ మీడియా కథనాల ద్వారా అర్థమవుతోంది. కాగా వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియాలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు తర్వాత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. గంభీర్‌తో రోహిత్‌కు సమన్వయం కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా గంభీర్‌ ప్రధాన కోచ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వన్డే, టీ20లలో బాగానే రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటోంది. గౌతీ కోచ్ గా వచ్చిన దేశంలో బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేయడం మినహా చెప్పుకోగదగిన విజయాలు లేవు. పైగా కివీస్ చేతిలో సొంతగడ్డపైనే 0-3తో ఘోరపరాభవం మరింత ఒత్తిడి పెంచింది.ప్రస్తుతం సిడ్నీలో ఉన్న టీమిండియా చివరి మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.