Politics of Khalistan: కెనడాలో ఖలిస్థాన్ పేరుతో రాజకీయం చేయడం వెనుక ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యూహం ఇదే..?

కెనడాలో ఖలిస్థాన్ చిచ్చు రాజేసిన ప్రధాని జస్టిన్ ట్రూడో అసలు వ్యూహం ఇదే. అక్కడి సిక్కుల జనాభా తోపాటూ వారి ప్రభావం అన్ని రంగాల్లో కీలకంగా మారింది. దీంతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఈ ఆరోపణను అస్త్రంగా చేసి ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2023 | 10:04 AMLast Updated on: Sep 23, 2023 | 10:04 AM

Is This The Real Strategy Behind Canadian Prime Minister Justin Trudeau Doing Politics In The Name Of Khalistan

గత కొంత కాలంగా కెనడా – భారత్ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఖలిస్థాన్ పేరుతో మారణకాండకు పాల్పడాలని భావిస్తున్నారు. దీనికి గల ప్రదాన కారణం హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మన దేశం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా పార్లమెంట్ సాక్షిగా ఈ ఆరోపణలు చేయడంతో ఇరుదేశాల మధ్య చిచ్చు పెరిగింది. దీనిప్రభావం ఎగుమతి, దిగుమతులపై పడింది. అక్కడి దౌత్యవేత్తలు ఒకరికొకరు బహిష్కరించుకున్నారు. దీనికంతటికీ కారణం జస్టిన్ ట్రూడో స్వార్థ ప్రయోజనాలే అని అంటున్నారు నిపుణులు. రాజకీయంగా బలపడేందుకే ఖలిస్థాన్ ఉగ్రవాద హత్యను వెలుగులోకి తెచ్చాడన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ పంజాబీలకు అక్కడ రాజకీయంగా శాసించే స్థాయి ఉందా. ఇది ఎలా ఏర్పడింది అనే అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

రెండు దశాబ్ధాలలో జనాభా పెరుగుదల..

కెనడాలో 2021 లెక్కల ప్రకారం ఆదేశ జనాభా 3.70 కోట్లు గా ఉండేది. అందులో మన దేశానికి చెందిన వారు 16 లక్షలకు పైనే ఉండేవారు. కెనడా జనాభాలో ఇది నాలుగు శాతంగా ఉంటుంది. ఇక సిక్కుల జనాభా విషయానికి వస్తే భారతీయ సిక్కులు 7.70 లక్షల మంది జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే గడిచిన రెండు దశాబ్థాలుగా సిక్కుల జనాభా కెనడాలో అమాంతం పెరిగిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా కూడా వీరే కీలకపాత్ర పోషించడం గమనార్హం. పంజాబ్ నుంచి వలసలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి గల కారణం కూడా గతంలో వెళ్లి మంచిగా స్థిరపడిన వారు తమ బంధువులను, సమీపీకులను, స్నేహితులను పిలిపించుకుని స్థిరపడుతున్నారు. దీంతో వీరి జనాభా పెరిగిపోయి రాజకీయంగా ప్రభావం చూపుతోంది.

వర్గ పరంగా 4, భాష పరంగా 3వ స్థానం..

క్రిస్టియన్, ముస్లీం, హిందూవుల తరువాత సిక్కుల జనాభాయే కీలకంగా మారింది. నాలుగో స్థానంలో వీరు నిలిచి దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నారు. ఒంటారియో, బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా ప్రాంతాల్లో అధికంగా నివసిస్తున్నారు. కెనడా స్థానిక భాషతో పాటూ పంజాబీ భాషకు కూడా ప్రాధాన్యం పెరిగింది. ఆ దేశంలోనే పంజాబీ భాష మూడో స్థానంలో నిలిచింది. ఆ దేశ ప్రధాని ఎందుకు గత స్మృతిల్ని బయటకు వెలికి తీశారో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

అన్నింటా వీరే కీలకం..

నిర్మాణ రంగంలోని కాంట్రాక్టర్ల మొదలు కార్మికల వరకూ.. రవాణా రంగంలో ట్రాన్ పోర్ట్ ఏజెన్సీల మొదలు క్యాబ్ డ్రైవర్ల వరకూ.. బ్యాంకింగ్ రంగంలోనూ అధికంగా డిపాజిట్లను నెలకొల్పడం ద్వారా దేశ పురోగతికి దోహదపడుతున్నారు. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్ వంటి సేవలు అందించడంలోనూ ప్రదాన భూమిక పోషిస్తున్నారు. 1980 కెనడా జనాభా లెక్కల ప్రకారం అక్కడ నివసించే సిక్కుల సంఖ్య కేవలం 35వేల మందిగా తెలిసింది. తాజాగా వెలువడిన గణాంకాల్లో 4.15 లక్షల మంది సిక్కులు శాశ్వత నివాసాన్ని పొంది ఉన్నారు.

ఎన్నికల నిధులు సమీకరణలో ప్రదాన భూమిక

జస్టిన్ ట్రూడో 2015లో అధికారంలోకి వచ్చిన తరువాత సిక్కు మతస్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తన కేబినెట్లో కేవలం నలుగురికి సిక్కు మంత్రులుగా స్థానం కల్పించారు. అంతే కాకుండా కేంద్ర స్థాయిలో అధిక శాతం వాటా ఈ సామాజికి వర్గానికే కేటాయించి తన రాజకీయ వ్యూహాన్ని పదును పెట్టారు. పైగా కెనడాలో సిక్కులు ఇంతటి ప్రాధాన్యత కలిగేందుకు ప్రదాన కారణం అక్కడ వెలసిన గురుద్వారాలే అంటున్నారు పరిశీలకులు. ఈ గురుద్వారాల ద్వారా సిక్కు ఫండ్స్ ను గ్రాంట్ ల రూపంలో వసూలు చేసి ఎన్నికల్లో ఖర్చు చేస్తారు. కెనడా మొత్తం 388 పార్లమెంట్ సభ్యులు ఉండగా అందులో 18 మంది ఎంపీలు సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇందులో ఎనిమిది స్థానాలు పూర్తిగా తమ ఆధీనంలో ఉండేలా పావులు కదుపుతారు. మరో 15 సీట్లలో కీలక ప్రభావం చూపేలా తమ రాజకీయ విస్తృతిని పెంపొందించుకున్నారు. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా సిక్కులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు.

T.V.SRIKAR