YS Sharmila Vs Jagan: షర్మిల బాణం జగనన్ననే గురి పెట్టబోతోందా…?
షర్మిల డీకే శివకుమార్ ను కలవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు దీనిపై క్లారిటీ రాకపోవచ్చు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. దేన్నీ కొట్టి పారేయలేం.
వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుటుంబంలో అంతర్గత విభేదాలున్న విషయం తెలిసిన విషయమే. వివేకా హత్య తర్వాత ఈ విభేదాలు వీధికెక్కాయి. వై.ఎస్.జగన్, వై.ఎస్.షర్మిల మధ్య కూడా గ్యాప్ చాలా ఉంది. ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. తల్లి విజయమ్మ కూడా జగన్ ను వదిలేసి షర్మిలతోనే ఉంటున్నారు. వైసీపీలో తనకు స్థానం లేదని గ్రహించిన షర్మిల మెట్టినిల్లు తెలంగాణకు వచ్చేసి ఇక్కడ పార్టీ పెట్టి పోరాడుతున్నారు. అయితే తెలంగాణలో తనకు అదృష్టం వరిస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి ఉంది. రెండేళ్ల నుంచి తెలంగాణలో పోరు సాగిస్తున్నా ఇప్పటివరకూ పార్టీకి ఊపు రాలేదు. దీంతో ఇతర ప్రత్యామ్నాయాలపైన కూడా షర్మిల ఆలోచిస్తున్నారు.
షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. సొంతంగా ఎంత పోరాడినా ఉపయోగం ఉండట్లేదని భావిస్తున్న షర్మిల.. కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే ఉనికి చాటుకోవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తన అవసరం కూడా ఆ పార్టీకి ఉంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే ఇటు తనకు, అటు కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. ఇద్దరికీ కావాల్సింది కూడా అదే.
అయితే షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తే ఆమె సేవలను మరోలా వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. షర్మిలను తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కీలక పాత్ర పోషించేలా స్కెచ్ వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏకంగా అక్కడ పీసీసీ పగ్గాలు అప్పగించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఫ్యామిలీ ఎంతో చేసింది. ఇప్పుడు రాజన్న బిడ్డ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలిస్తే కచ్చితంగా మేలు జరుగుతుందనే ఆలోచన కాంగ్రెస్ కు ఉంది. అదే జరిగితే అక్కడ జగన్ వర్సెస్ షర్మిలగా సీన్ మారుతుంది. ఇప్పటికిప్పుడు వైసీపీకి కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోయినా జగన్ తో సోదరి షర్మిల ఢీకొట్టడం అంటే అది మామూలు విషయం కాదు.
మరోవైపు.. ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితం చేసి ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలు ముగిసన తర్వాత ఏపీలో షర్మిల సేవలను వాడుకునేలా కూడా కొంతమంది కాంగ్రెస్ పెద్దలకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా షర్మిల కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆయన ఇంటికెళ్లి కలిశారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో డీకే శివకుమార్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు షర్మిల డీకే శివకుమార్ ను కలవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు దీనిపై క్లారిటీ రాకపోవచ్చు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. దేన్నీ కొట్టి పారేయలేం.