Gold Purchase: భారతీయులకు పసిడిపై మోజు తగ్గిందా..?
అవునా నిజమా అనకండి.. మోజు తగ్గిందో లేక బంగారం ధరకు బెంబేలెత్తిపోయారో కానీ పసిడి కొనుగోళ్లను తగ్గించారు. గత త్రైమాసికంలో దేశంలో జరిగిన బంగారు అమ్మకాలే ఈ నిజాన్ని బయటపెట్టాయి.
భారతీయులకు, బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. బంగారం లేని భారతీయ ఇల్లు ఉంటుందంటే నమ్మలేం. మగువల ఒంటిపై బంగారం వారి అందానికి మరింత మెరుగులు అద్దుతుంది. బంగారం మనకు కేవలం ఆభరణం కాదు.. అది మనకో నమ్మకం. ఆర్థిక భద్రతకు మార్గం.. ఏ పండగొచ్చినా, ఏ శుభకార్యం జరిగిన కచ్చితంగా బంగారం కొంటాం. ధర పెరిగినా ఎంతో కొంత కొనకుండా ఉండలేం. దేశంలో ఎప్పటికప్పుడు బంగారం కొనుగోళ్లు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం బంగారం అమ్మకాలు కాస్త తగ్గాయి.
పసిడి కొనుగోళ్లు ఎంత తగ్గాయి..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయంగా పసిడికి గిరాకీ తగ్గింది. గతేడాది ఫస్ట్ క్వార్టర్‌తో పోల్చితే 7శాతం తగ్గి 158.1 టన్నులకు పరిమితమైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో 170.7 టన్నుల బంగారం డిమాండ్ ఉంది. ఈ త్రైమాసికంలో ఆభరణాలకు డిమాండ్ తగ్గింది. గతేడాది ఇదే సమయంలో 140 టన్నుల బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఈసారి అది 128.6 టన్నులకు పరిమితమైంది. అంటే ఆభరణాలకు 8శాతం డిమాండ్ తగ్గింది. బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లు కూడా తగ్గాయి. డిమాండ్ తగ్గినా దిగుమతులు మాత్రం తగ్గలేదు. జూన్‌తో ముగిసిన తొలి ఆరునెలల కాలంలో 271 టన్నుల మేర కొనుగోళ్లు జరిగాయి. ఈ ఏడాది మొత్తం మీద 650-750 టన్నుల మేర డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పసిడి కొనుగోళ్లు ఎందుకు తగ్గాయి..?
ధర ఎంత పెరిగినా గతంలో భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఉండేవారు కాదు. కానీ ఇటీవల పసిడి రేట్లు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర 64వేలను కూడా టచ్ చేసింది. తర్వాత కాస్త తగ్గింది. మూడు నెలల కాలంలో పసిడి రేట్లు ఏకంగా 12శాతం పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలుకు ప్రజలు అంత ఆసక్తి చూపలేదు. తర్వాత కొందాంలే అని కొందరు, బంగారం కన్నా మెరుగైన పెట్టుబడి సాధనాలవైపు మరికొందరు మొగ్గారు. దీంతో పసిడి కొనుగోళ్లు తగ్గాయి.
రూ.2వేల నోటు కాపాడిందా..?
నిజానికి బంగారం డిమాండ్ గత త్రైమాసికంలో ఇంకా చాలా తక్కువగా ఉండాలి. కానీ మధ్యలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పసిడిని కొంత మేర కాపాడింది. 2వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇష్టపడని చాలామంది దాంతో బంగారం కొనుగోలు చేశారు. కొన్ని వేల కోట్ల బంగారం అమ్మకాలు 2వేలనోట్లతోనే జరిగింది. బ్లాక్‌మనీ చాలా వరకు బంగారం రూపంలోకి మారిపోయింది. ఆ 2వేల నోట్లు రద్దు కాకుంటే బంగారం కొనుగోళ్లు ఇంకా తక్కువగా ఉండేవి.
మిగిలిన ఏడాది ఎలా ఉండబోతోంది..?
ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉంది. కానీ ఈసారి మాత్రం మన దగ్గర డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది చివరి వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పసిడి రూపంలో దాచుకోవడం కంటే భూమిపై పెట్టుబడులవైపు వెళితే మంచి రాబడులు వస్తాయన్న ఆలోచన జనంలో పెరుగుతోంది. అలాగని బంగారానికి డిమాండేమీ తగ్గదు. అలాగనీ భారీగా పెరగదు. రానున్న రోజుల్లో పసిడికి డిమాండ్ మళ్లీ పుంజుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. కేంద్ర బ్యాంకులు కూడా భారీగానే కొనుగోళ్లకు దిగుతాయని భావిస్తోంది. వర్షాలు సమృద్ధిగా పడితే దీపావళి సీజన్‌లో పసిడి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది.