Chandrababu: ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు.. బయటకు రానివ్వరా ?
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.

It doesn't look like Chandrababu will get out of Rajahmundry Central Jail anytime soon
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తుంటే.. తప్పు చేసింది ఎవరైనా సరే తప్పించుకోలేరు అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై అసెంబ్లీలోనూ రచ్చ రచ్చ జరుగుతోంది. అసెంబ్లీలో అన్నీ తానై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు బాలకృష్ణ. ఇక అటు చంద్రబాబు మీద మరిన్ని కేసులు నమోదు కావడం ఖాయం అంటున్న వైసీపీ నేతలు.. లోకేశ్ అరెస్ట్ తథ్యం అంటూ జోస్యం చెప్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. చంద్రబాబును సీఐడీ పదే పదే కస్టడీ కోరుతుండడం.. పొడిగిస్తూ కోర్టు తీర్పులివ్వడంలాంటి పరిణామాలు చూస్తుంటే.. ఇప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.
సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. కాగా ఆయన రిమాండ్ మళ్లీమళ్లీ పొడిగిస్తూ ఉండటం హాట్‌టాపిక్ అవుతోంది. 2024 ఎన్నికల వరకు చంద్రబాబు బయటకు వచ్చే ఛాన్స్ లేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం ఉన్నా.. మరికొన్ని కేసులు సిద్ధంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తోందనే చర్చ జరుగుతోంది. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలలో.. మెజారిటీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇవ్వలేదని సమాచారం అందుతోంది. ఈ స్కీమ్‌లో ప్రధానంగా అధికారులదే తప్పు అనే విధంగా చంద్రబాబు సమాధానాలు ఉన్నాయని తెలుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కారణంగా కొంతమంది అధికారులకు కూడా ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ద్వారా టీడీపీ బలాన్ని తగ్గించే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది.
పరిణామాలు చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది కూడా ! చంద్రబాబు అరెస్ట్‌కు ముందు టీడీపీలో కనిపించిన జోష్ అంతా ఇంతా కాదు. చంద్రబాబు జిల్లాల్లో కనిపిస్తే.. యువగళం అంటూ లోకేశ్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే అరెస్ట్ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయ్. క్షేత్రస్థాయిలో ఒక్క నాయకుడు కనిపించడం లేదు. అంతా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం మీదే ఫైట్ చేస్తున్నారు. ఇలా చూస్తే ఒకరకంగా వైసీపీ ప్లాన్ సక్సెస్ అయినట్లే అనిపిస్తోంది. ఐతే చంద్రబాబును విచారిస్తున్న తీరు.. సీఐడీ దూకుడు చూస్తుంటే.. ఎన్నికల వరకు బెయిల్ రావడం కష్టమేమో అనే చర్చ జరుగుతోంది. ఏమైనా ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష పడితే.. ఆయన పొలిటికల్ కెరీర్‌కు ఇబ్బందే !