‍Narendra Modi: బీజేపీ సౌత్ మిషన్ 2024.. తమిళనాడు నుంచి ఎన్నికల బరిలో ప్రధాని మోదీ ?

దక్షిణభారతం.. కమలనాథులకు రాజకీయంగా ఇప్పటికీ మింగుడు పడని బ్రహ్మపదార్థం. ఉత్తర భారతంలో ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో తమకు తిరుగులేదని నిరూపించుకున్న బీజేపీ దక్షిణాదిన పాగా వేసేందుకు ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా.. వర్క్ అవుట్ కావడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 10, 2023 | 08:15 PMLast Updated on: Jul 10, 2023 | 8:15 PM

It Is Reported That Prime Minister Narendra Modi Is Going To Contest The Election In Tamil Nadu As Part Of Bjps South Mission 2024

దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో కూడా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. సౌత్ లో బీజేపీకి స్థానం లేదు అన్న విధంగా దక్షిణాది ఓటర్లు ఆ పార్టీకి తలుపులు మూసేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను కాదని.. బీజేపీని గెలిపించేందుకు తెలంగాణ ఓటర్లు సిద్ధంగా లేరు. ఆ విషయం బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసు. అయినా సరే దక్షిణాదిన కూడా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బీజేపీ అంటే కేవలం ఉత్తర భారత పార్టీ అన్న ముద్ర వేసుకున్న కమలనాథులు.. దక్షిణాదిన విస్తరించేందుకు వచ్చే లోక్‌సభ ఎన్నికల వేళ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయబోతున్నట్టు వివిధ పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. సౌత్ మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసేందుకు ఈసారి నేరుగా ప్రధానమంత్రి మోదీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.

తమిళనాడు నుంచి ఎన్నికల బరిలో మోదీ
ఈ మధ్య కాలంలో తమిళనాడుతో ప్రధానమంత్రి మోదీ బాగా కనెక్ట్ అవుతున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి బీజేపీ పెద్దలు తమిళ టచ్ ఇచ్చారు. లోక్‌సభలో ఏర్పాటు చేసిన రాజదండం తమిళ చోళ చక్రవర్తుల కీర్తికి అద్దం పడుతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటీషర్ల నుంచి నాటి ప్రధాని నెహ్రూ అందుకున్న సెంగోల్‌ను కొంతకాలం క్రితం వరకు మ్యూజియంలో భద్రపరిస్తే.. దాన్ని బయటకు తీయించింది బీజేపీ. తమిళనాడుకు చెందిన సాధువులు స్వయంగా పార్లమెంట్‌కి వచ్చి మోడీ చేతుల మీదుగా రాజదండాన్ని లోక్‌సభలో ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా అటెన్షన్ మొత్తం తమిళనాడుకు మారిపోయింది. ఇదొక్కటే కాదు.. దక్షిణాది రాష్ట్రాలను..మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు దగ్గరయ్యేందుకు కమలనాథులు మోడీ స్థాయిలో రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు.

గతేడాది మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో తమిళకాశీ సంఘం సమావేశాలను నెలరోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న కాశీకి.. తమిళనాడులో ఉన్న రామేశ్వరానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ తమిళ కాశీ సంఘం వేదికగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. నాగరికత ,ఆధ్యాత్మికత, సాంస్కృతిక విషయాల్లో కాశీకి, రామేశ్వరానికి విడదీయరాని బంధం ఉందని మోడీ చెప్పుకొచ్చారు. కాశీ విష్ణుమూర్తికి నిలయమైతే.. తమిళనాడు రామనాథమూర్తికి నిలయంగా మారిందంటూ కాశీ రామేశ్వర బంధాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు సందర్భాల్లోనూ మోడీ నేరుగా తమిళనాడుతో ‌కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి ఈ రెండింటినీ అడ్డం పెట్టుకుని తమిళనాడు రాజకీయాల్లో బలం పుంచుకునే ప్రయత్నం మొదలుపెట్టింది కాషాయ పార్టీ.

తమిళనాడులో మోడీ పోటీ చేసేదెక్కడ ?
ఇప్పటికే వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోదీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే మరోసారి పోటీ చేస్తూనే.. తమిళనాడు నుంచి కూడా బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దక్షిణాదిన పుంజుకోవాలంటే.. అది మోదీ మానియాతో సాధ్యమని నమ్ముతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలు మోడీని రంగంలోకి దింపుతున్నారు. రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మోడీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ హిందుత్వ విధానాలకు ప్రతిరూపంగా ఉండే రామేశ్వరం క్షేత్రం ఈ ఎంపీ సీటు పరిధిలో ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి.. వారణాసి తరహాలో బీజేపీలో జోష్ నింపాలని మోడీ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రాతినిధ్యం వహిస్తోంది.

రామనాథపురం కాకుంటే కన్యాకుమారి ?
మోడీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల జాబితాలో కన్యాకుమారి కూడా ఉంది. కేరళ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ గెలిచినా.. 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో కన్యాకుమారి స్థానం నుంచి మోదీ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థి గానీ, లేదా మోడీ గానీ ఇక్కడ గెలిస్తే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ప్రభంజన వీస్తోందన్న సంకేతాలను ప్రత్యర్థి పార్టీలకు పంపించవచ్చ భావనలో బీజేపీ ఉంది.

అమిత్ షా మాటలకు అర్థం అదేనా ?
ఇటీవల తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళియన్‌ను ప్రధానమంత్రిగా చూడాలని బీజేపీ కోరుకుంటుంది అంటూ పార్టీ నేతల అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారు. మోడీ తమిళనాడు నుంచి పోటీ చేసి గెలిస్తే.. ఆయన తమిళియన్ అయిపోతారని షా కామెంట్స్‌కు ఓ తమిళ బీజేపీ నేత అర్థం కూడా చెప్పారు. వెల్లూరులో జరిగిన బీజేపీ బహిరంగసభలో పాల్గొన్న అమిత్ షా తమిళనాడు ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. రాజదండాన్ని లోక్‌సభలో ప్రతిష్టించడానికి గుర్తుగా ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞత చెబుతూ కనీసం 25 పార్లమెంట్ సీట్లలో విజయాన్ని కానుకగా అందించాలని కోరారు. దీనిని బట్టి బీజేపీ పెద్దలు తమిళనాడుపై ఎంత ఫోకస్ చేశారో అర్థమవుతుంది.

2019 నుంచే బీజేపీ తమిళనాడు స్కెచ్
రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి బీజేపీ చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. సందర్భం వచ్చే వరకు బీజేపీ అలా ఎందుకు చేసిందో రాజకీయ పండితులకు కూడా అంతుపట్టదు. 2019లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటకు వచ్చారు. దేశరాజధాని ఢిల్లీలో జిన్‌పింగ్‌తో సమావేశమయ్యే వెసులుబాటు ఉన్నా మోడీ మాత్రం మహాబలిపురాన్ని జిన్‌పింగ్‌తో మీటింగ్‌ ప్లేస్‌గా ఎంచుకున్నారు. ఈ రకంగా ఏదో రూపంలో తమిళనాడుకు దగ్గరయ్యేందుకు మోడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తుండటం, విపక్షాలను బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడటం వంటి పరిణామాలను గమనిస్తున్న కమలనాథులు.. దక్షిణాది అవకాశాలను వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయంగా ఉన్న తమిళనాడు నుంచే హిందుత్వ రాజకీయం చేస్తే ఎన్నికల్లో కలిసి వస్తుందన్న నమ్మకం బీజేపీలో కనిపిస్తోంది. అందుకే ఈసారి తమిళనాడుపై ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. బీజేపీ ఇన్‌సైడర్స్ చెబుతున్నది నిజమే అయితే గనుక.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోడీ తమిళనాడు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.