Telangana Elections: తెలంగాణలో అధికారం డిసైడ్ చేసేది వీళ్లే..
తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేసింది.
తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు అధికశాతంలో ఉన్నారు. అలాగే తొలిసారి ఓటు వినియోగించుకునే వారు ఎప్పుడూ లేని విధంగా పెరగడం గమనార్హం. 18-19 సంవత్సరాల వయసు కలిగిన కొత్త ఓటర్లు 4,76,597 మందిగా గుర్తించారు. ఇది జాబితా తయారు చేసే నాటికి ఉన్న గణాంకాలు మాత్రమే. ఎన్నికల నాటికి మరి కొంత మంది పెరిగే అవకాశం ఉంది. అయితే నియోజక వర్గాల వారిగా చూసుకుంటే మొత్తం 119 లో సగానికిపైగా మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించేది మహిళా ఓటర్లే అన్నది క్లియర్ కట్ గా అర్థమౌతోంది. వీరిని ఆకర్షించే పథకాల్లో గత పాలకులు ఏమాత్రం సంతృప్తి పరిచారో రానున్న ఎన్నికలు తేల్చనున్నాయి.
- తెలంగాణలో 3,06,42,333 మంది ఓటర్లు.
- ఏడాది ప్రారంభంతో పోలిస్తే 6,64,674 మంది పెరుగుదల.
- తొలిసారి ఓటు వినియోగించుకుంటున్న వారు 4,76,597 మంది.
- ఓటు హక్కు తొలగించినట్లు గుర్తిస్తే 15 రోజుల్లో దరఖాస్తుకు అనుమతి.
- సగానికి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పైచేయి.
మహిళా.. యువ ఓటర్లే కీలకం..
ప్రతిఏటా జనవరి 5న కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. గతంతో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా కనిపిస్తుంది. చాలా వరకూ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా నమోదు అయ్యారు. తెలంగాణలో మొత్తం 3,06,42,333 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. వీరిలో 1,53,73,066 మంది పురుషులు కాగా 1,52,51,797 మంది మహిళలు. వీరితో పాటూ 15,337 మంది సర్వీస్ ఓటర్లు, 2,133 మంది ఇతరులు ఉన్నారు. 2023 జనవరిలో విడుదల చేసిన జాబితాతో పోలిస్తే.. ప్రస్తుతం 6,64,674 మంది ఓటర్లు పెరిగారు. అలాగే 18-19 సంవత్సరాల మధ్య వయసువారిలో తొలిసారి ఓటరుగా 4,76,597 మంది నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,62,552 మంది కాగా అత్యల్పంగా భద్రాచలంలో 1,44,170 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికల జరగనున్న తరుణంలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సవరణ ప్రక్రియను చేపట్టింది ఎన్నికల సంఘం. అందులో భాగంగానే తాజా ముసాయిదా ఓటర్ల జాబితాను తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సోమవారం ప్రకటించారు.
మహిళా సంక్షేమాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్
ఈ జాబితా ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి కాస్త సానుకూలత ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. దీనికి కారణం గత పాలనలో మహిళలకు చాలా వరకూ సంక్షేమ పథకాలు అందించడమే అని తెలుస్తుంది. గతంలో చూసుకుంటే వృద్ధ ఓటర్లు పింఛన్ పథకానికి ఖుషీ అయి కేసీఆర్ కి ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మహిళా సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం పడతారని భావిస్తున్నారు కొందరు నాయకులు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, కంటి వెలుగు పథకాలు అమలు చేస్తున్నది తమ ప్రభుత్వమే కాబట్టి మరో సారి గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే సాంకేతిక పరంగా కూడా టీ హబ్ ప్రారంభించి మహిళా సాధికారతను పెంపొందించామని కనుక కచ్చితంగా మహిళల ఓట్లు తమ ఖాతాలో వచ్చి పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
T.V.SRIKAR