Pawan Kalyan: వాలంటీర్లపై వ్యాఖ్యలతో పవన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా ?
రాజకీయాల్లో హత్యలు ఉండవ్.. ఆత్మహత్యలు తప్ప! చేసిన తప్పు, తీసుకున్న తప్పుడు నిర్ణయం.. ఏదో ఒక రోజు శత్రువుకు ఆయుధమై మనల్నే సంహరిస్తుంది అంటారు. చరిత్ర పేజీలు తిరగేసినా.. ఏ దేశ రాజకీయ చరిత్ర చూసినా ఇదే కనిపిస్తుంది.
చిన్న నిర్ణయం.. పెరిగి పెను ఉప్పెనగా మారి పార్టీని వెనక్కి తోసేస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు జరిగింది అదే.. గత ఎన్నికల్లో పొత్తులు అంటూ టీడీపీ తీసుకున్న నిర్ణయం కారణంగా కారణంగా జరిగింది కూడా అదే ! ఒక్క నిర్ణయం రెండు పార్టీలను చాలాకాలం వెనక్కి తోసేసింది. ఇప్పుడు పవన్ కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోందిప్పుడు! జనాల కోసం కష్టపడుతున్నారనే పేరు తెచ్చుకున్నారు.. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా హ్యాండ్ ఇచ్చారే పాపం అనే సింపథీ సాధించారు. వారాహి యాత్రలో అది స్పష్టంగా కనిపించింది కూడా ! అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి. వాళ్లను చూసిన ఆనందమో.. మరేదో కారణమో కానీ.. జోష్ మీద కనిపించారు పవన్ కల్యాణ్. వైసీపీ మీద ఘాటు విమర్శలు గుప్పించారు.
మొదటి దశలో వైసీపీ మీద రాజకీయంగానే ఆరోపణలు గుప్పించిన సేనాని.. రెండో దశ యాత్రలో మాత్రం లెక్కలు కూడా చూపించారు. కాగ్ రిపోర్టును పాయింట్ టు పాయింట్.. టు ది పాయింట్ అన్నట్లు.. జనాలకు అర్థం అయ్యే భాషలో వివరించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన విమర్శలు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయ్. ఇవి పవన్ కల్యాణ్‌కు బూమరాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మాటల్లో వాడి పెరిగింది నిజమే.. అది మనల్ని వేటాడకుండా చూసుకోవాలి. పవన్ ఇదే మిస్ అయ్యారా అంటే.. నిజమే అనిపిస్తోంది. వ్యవస్థ మీద ఆరోపణలు సరే.. వాలంటీర్ల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే.. కచ్చితంగా తప్పుడు నిర్ణయమే అనిపిస్తోంది.
పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు వాలంటీర్లు అంతా భగ్గుమంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ కారణంగా ప్రభుత్వానికి లాభమా.. వైసీపీ లాభమా అన్న సంగతి పక్కన పెడితే.. వాళ్లో పెద్ద సైన్యం. అలాంటి ఇలాంటి సైన్యం కాదు.. దాదాపు 2లక్షల 80వేల సంఖ్య ఉన్న సైన్యం. ఇప్పుడు వాళ్లంతా జనసేనకు రివర్స్ అయితే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ మీద కచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వాళ్లో రెండున్నర లక్షలు.. వాళ్లు ప్రభావితం చేసే కుటుంబ సభ్యులు ఇంటికి ముగ్గురు వేసుకున్నా.. పది లక్షల వరకు ఓట్లు ప్రభావితం అవుతాయ్. ఇలా పవన్ ఇరుకునపడినట్లు కనిపిస్తున్నారు. వైసీపీని కార్నర్ చేయబోయి.. వాలంటీర్ల చేతికి చిక్కారు. మరి ఈ కష్టాన్ని, ఇబ్బందిని సేనాని ఎలా దాటుతారన్నది ఆసక్తికరంగా మారింది.