Chandrababu: బాబు కోసం బీజేపీ పెద్దలు.. రంగంలోకి దిగుతారా ?
చంద్రబాబు విషయంలో బీజేపీ కీలక నేతలు జోక్యం చేసుకుంటారా..
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీలో కొత్త పొలిటికల్ టర్న్ కు దారితీస్తుందా ? ఈ పరిణామం ఏపీ రాజకీయాలను మరో మలుపు తిప్పుతుందా ? సరికొత్త రాజకీయ సమీకరణాలకు పునాదులు వేస్తుందా ? అంటే .. ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. చంద్రబాబు రాజకీయంగా ఒంటరి అయ్యారని అనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటులో బిల్లులు పెట్టినప్పుడల్లా సపోర్ట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ చేరువయ్యారు. తనకున్న ఎంపీల బలంతో.. ఆపద్బాంధవుడిలా మోడీ అండ్ టీమ్ దృష్టిలో ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. జగన్ పై ఉన్న కేసుల దర్యాప్తులో స్పీడు కూడా తగ్గిపోయింది. కేంద్ర సర్కారు నుంచి నిధుల మంజూరు కూడా పెరిగిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కేంద్రం పెద్దల అపాయింట్మెంట్లు కూడా వైఎస్సార్ సీపీ చీఫ్ కు దొరుకుతున్నాయి.
ఇక ఇదే సమయంలో చంద్రబాబు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఆయన న్యూట్రల్ గా ఉండటం మైనస్ పాయింట్ గా మారిపోయింది. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్ గా మల్చుకొని ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా చేసింది. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఐక్యతను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అనేందుకు ఇదొక సంకేతమని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ ఒక్క ప్రకటన కూడా చేయని విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ తో వైరుధ్యాలు ఏర్పడినా.. షర్మిల ఏపీలో రాజకీయం చేయకుండా తెలంగాణకు పరిమితమయ్యారు. కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీలో మాత్రం ఏపీలోనే ఒకరితో ఒకరు తలపడేందుకు రెడీ అవుతున్నారు. ఈ అనైక్యత ఇతర పార్టీలకు అడ్వాంటేజ్ గా, టీడీపీకి మైనస్ పాయింట్ గా మారనుంది.
ఓవైపు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి.. మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి చంద్రబాబు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎవ్వరూ ఆయనకు సపోర్ట్ గా నిలిచేందుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్, బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ చేసిన ప్రకటనలతో పెద్దగా ప్రయోజనం ఉండదు. జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలో.. కాంగ్రెస్ పెద్దలో చంద్రబాబుకు అండగా రంగంలోకి దిగితే సీన్ మారే అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రతీకారం కోసమే చంద్రబాబును అరెస్టు చేశారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖ రాశారు. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదు.
చంద్రబాబు అరెస్టుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ లీడర్లకు ఇచ్చిన అపాయింట్మెంట్ ను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాత్రికి రాత్రి క్యాన్సల్ చేసుకున్నారు. దీన్నిబట్టి చంద్రబాబుకు హెల్ప్ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వానికి లేదనే విషయం క్లియర్ అయింది. బహుశా.. చంద్రబాబు తమ కూటమికి అనుకూలంగా స్టాండ్ తీసుకున్నాకే సాయం చేద్దామనే వ్యూహంతో బీజేపీ పెద్దలు ఉన్నారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయితే.. వైసీపీని తమ రహస్య మిత్రుడిగా, జనసేనను బహిరంగ మిత్రుడిగా మెయింటైన్ చేయాలనే ప్లాన్ తో కమలదళం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నంతో జీ20 సదస్సు ముగిసింది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం కల్లా బీజేపీ పెద్దల దృష్టికి చంద్రబాబు అరెస్టు అంశం చేరితే ఏం జరుగుతుందో వేచిచూడాలి.