Asia Cup: వర్షం పడదు.. మ్యాచ్ ఉంటుంది
ఆసియా కప్ పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ కి వరుణుడి అడ్డంకి తొలగినట్లు తెలుస్తోంది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు తొలగినట్లే కనిపిస్తోంది. 2019 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో తలపడుతున్నాయి. పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందని తెలిసిన ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. అయితే తాజా అంచనాల ప్రకారం ఈ మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి తొలగినట్లే కనిపిస్తోంది. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందట. మ్యాచ్ రోజున సాయంత్రానికి పల్లెకెలెలో వర్షం పడే అవకాశం 90 శాతం వరకు ఉందని తెలిసిన ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందారు.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కేవలం గంటల వ్యవధిలోనే అయిపోయాయంటేనే.. ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతగా ఎదురు చూశారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మ్యాచ్ వర్షార్పణం అవుతుందేమో? అని అభిమానులు భయపడ్డారు. ఈ రెండు టీమ్స్ చివరగా గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ 82 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ తర్వాత మళ్లీ భారత్, పాక్ తలపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇలాంటి సమయంలో వర్షం వార్తలు టెన్షన్ పెట్టాయి. తాజాగా పల్లెకెలె వాతావరణం గురించి అందుతున్న సమాచారం ప్రకారం, ఇక్కడ కేవలం చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయట. ఇవి కూడా మ్యాచ్ మొదలయ్యే సమయానికి తగ్గిపోతాయట. ఈ రోజు భారీ వర్షం పడే అవకాశమే లేదని వెదర్ రిపోర్టులు చెప్తున్నాయి. అయితే ఎండ పొడ మాత్రం చూపదని తెలుస్తోంది.