JC Brothers: జేసీ బ్రదర్స్ కు ఇక ‘ఒక్కటే’.. వారసుల ఫ్యూచర్ పై డైలమా ?
తాడిపత్రి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జేసీ బ్రదర్స్. ఇప్పుడు వీరి రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం అనగానే.. జేసీ బ్రదర్స్, వాళ్ల పాలిటిక్స్ గుర్తుకొస్తాయి !! 35 ఏళ్లపాటు నియోజకవర్గాన్ని తమకు కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్న జేసీ సోదరుల పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. వాళ్ల వారసుల రాజకీయ భవితవ్యంపైనా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో డిబేట్ నడుస్తోంది. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే. 1978 నుంచి తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ హవా నడిచింది. వారి రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ పని ఏపీలో అయిపోవడంతో జేసీ బ్రదర్స్ టీడీపీలోకి జంప్ అయ్యారు. చివరిసారిగా 2014లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం నుంచి ఎంపీగా, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకరరెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019లో జేసీ బ్రదర్స్ తమ వారసులను బరిలోకి దింపడంతో సీన్ రివర్స్ అయింది. వారసులను గెలిపించి.. తాము విశ్రాంతి తీసుకోవాలన్న వారి ప్లాన్ బెడిసికొట్టింది. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిని అనంతపురం లోక్ సభ స్థానంలో, ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని తాడిపత్రి అసెంబ్లీ స్థానంలో పోటీకి నిలపగా.. జగన్ వేవ్ లో వారిద్దరూ ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న వేళ జేసీ బ్రదర్స్ కి టీడీపీలో టికెట్ల ఇక్కట్లు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు.
చంద్రబాబు అలా చెప్పేశారట..
చంద్రబాబు ఈసారి అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అని చెప్పేశారని, తాడిపత్రికే పరిమితం కావాలని సూచించారని తెలుస్తోంది. ఈ లెక్కన జేసీ ప్రభాకరరెడ్డి కానీ ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి కానీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే తాడిపత్రి సీటులో జేసీ ప్రభాకరరెడ్డిని పోటీ చేయమని టీడీపీ అధినాయకత్వం కోరుతోందట. తాడిపత్రి సీటు చాలా ఇంపార్టెంట్ అని, రిస్క్ చేయలేమని చెప్పినట్టు సమాచారం. ఇక జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి అనంతపురం లోక్ సభ టికెట్ కూడా దక్కడం కష్టమేనని అంటున్నారు. దీంతో జేసీ బ్రదర్స్ వారసులకు ఈసారి సీట్లు లేవా అన్నది చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం ఎంపీ టికెట్ బీసీలకే..
అనంతపురం ఎంపీ సీటుకు ఇంచార్జిగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును చాలా కాలం క్రితమే చంద్రబాబు నియమించారు. 2019 ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన రంగయ్యను బరిలోకి దింపి వైసీపీ ఇక్కడ గెలిచింది. దీంతో బీసీ వర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుకు ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ కోటా లెక్కన.. జేసీ బ్రదర్స్ లో ఎవరికి కూడా టీడీపీ అనంతపురం లోక్ సభ టికెట్ దక్కే అవకాశం ఉండదని అంటున్నారు. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాలి. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలిపై సొంత పార్టీ కేడర్‌లోనే అసంతృప్తి ఉంది. తన ఉనికి కోసం మాత్రమే పాకులాడే ఆయన్ను నమ్ముకుంటే తమకు నష్టమేనని కొందరు కౌన్సిలర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు జేసీ అనుచరులు ఇటీవల పార్టీ మారారు.