IT Employees: అనారోగ్యానికి అడుగు దూరంలో ఐటీ ఉద్యోగులు.. కారణాలివే..!
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే వారిలో అధిక శాతం మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలిసింది. జాతీయ పౌషకాహార సంస్థ చేసిన సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

It was published in the August 2023 issue of the international peer-reviewed journal 'Nutrients' that IT employees are getting sick
ఉద్యోగం పురుష లక్షణం అన్నట్లు నేటి కాలంలో సాఫ్ట్ వేర్ అంటేనే ఉద్యోగ లక్షణం.. మరే ఇతర ఉద్యోగాలు చేసే వారిని ఉద్యోగులుగా పరిగణించడం లేదు సమాజం. దీనికి కారణం వీరు పొందే ప్యాకేజీ అని చెప్పాలి. ఐటీ ఎంప్లాయిస్ తీసుకునే సాలరీలు మరే ఇతర ఉద్యోగాల్లో ఉండవు అనేది అక్షర సత్యం. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఎక్కువ సేపు పని వేళలు, అధిక మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లలో మార్పులు, సరైన సమయానికి భోజనం చేయకవడంతో విచిత్రమైన రోగాలు, దీర్షకాలిక వ్యాధులు, అధికబరువు, ఊబకాయం వంటి సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నట్లు తాజాగా ఒక అధ్యయనంలో తేలింది.
తాజాగా హైదరాబాద్ ఐటీ రంగంలో పనిచేస్తున్న 183 మందిని అధ్యయనం చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రీసెర్చ్ స్కాలర్ పరోమితా బెనర్జీ సర్టిఫికేషన్ ఆధారంగా ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు ఒక గ్రూప్ గా ఏర్పాడి క్షణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ టీంలో డా. సుబ్బారావు, డా. భానుప్రకాశ్ రెడ్డి ఉన్నారు. వీరు పరిశోధనలు జరిపిన మీదట వచ్చిన ఫలితాల నివేదికను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. అంతర్జాతీయ పీర్ రివ్యూడ్ జర్నల్ ‘న్యూట్రియంట్స్’ ఆగస్టు 2023 సంచికలో కూడా ప్రచురితమయ్యాయి. ప్రతి 10 మందిలో ముగ్గురు అధిక బీపీ, ఒబెసిటీ, షుగర్ వంటి వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. అధ్యయనం చేసిన వారి నడుము చుట్టుకొలతలపై ప్రత్యేకంగా నివేదికను అందించారు. మగవారిలో సుమారు 36 అంగుళాలు, ఆడవారిలో 32 అంగుళాలు ఉన్నట్లు వివరించారు. చిన్న వయసులోనే ఇంత పరిమాణంలో చుట్టుకొలతలు ఉండటంవల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ప్రతి ఐటీ సంస్థలో ఒక హెల్త్ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచన
సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పట్ల సంస్థల యాజమాన్యాలు కొంత శ్రద్ద చూపడం అవసరమని తెలిపింది. వారికి మంచి ఆహారపు అలవాట్లకు, వ్యాయామానికి అలవాటు పడేలా ప్రోత్సహించాలని.. అలాగే తగిన విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యాలను కల్పించాలని సూచించింది. దీనికోసం ప్రత్యేకంగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇలా ఏర్పాటు చేయడం ద్వారా వారికి సమయానుగుణంగా వైద్యపరీక్షలు జరిపి ఆరోగ్యపరమైన లోపాలను వెలికితీసేందుకు వెసులుబాటు ఉంటుంది. దీంతో వారు తీసుకునే ఆహారంలో మార్పుల చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుంది అని వివరించింది.
నివేదికలో ముఖ్యమైన అంశాలు ఇవే..
- మూడు పదుల వయసు కలిగిన సీనియర్ ఉద్యోగుల్లో పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది.
- ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సీనియర్ శాస్త్రవేత్త డా. సుబ్బారావు తెలిపారు.
- 26 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వారిలో ఊబకాయం, అధికబరువు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు అతి చేరువలో ఉన్నట్లు తెలిపింది. ఇప్పుడే సరైన జీవన శైలిని అవలంబిస్తే వీటికి చెక్ పెట్టవచ్చని లేకుంటే తీవ్ర సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది.
- ప్రతి ఒక్క ఉద్యోగి సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ల దగ్గరే కూర్చోవడం, పనిమీదే ఏకాగ్రత పెట్టడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు.
- ప్రతి రోజూ బయట తిండి తినడం, సరైన సమయానికి ఇంటి భోజనం చేయకపోవడం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు దూరంగా ఉండటం, ఒక్కోసారి భోజనం పూర్తిగా మానేసి ఖాళీ కడుపుతో ఉండటం ఇలా చేయడం ద్వారా ఎసిడిటీ, ఉదర సంబంధమైన, జీర్ణక్రయ వ్యవస్థలో ఇబ్బందులకు గురవుతారని ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత తెలిపారు.
- ఈ సర్వేలో 78 శాతం మంది రోజూ వ్యాయామానికి దూరంగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే రోజులో 2 గంటలకు పైగా ఏదో రకంగా శరీర భాగాలను కదిలిస్తూ వ్యాయామం చేస్తున్నట్లు వివరించింది.
T.V.SRIKAR