Amazon: ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉగ్రవాద సంస్థల వస్తువులా..అమెజాన్‌కు బుద్ధి, జ్ఞానం ఉందా ?
ఆన్‌లైన్‌లో ఏదైనా అమ్మకానికి పెట్టొచ్చా ? నీతి నియమాలు అన్నవి ఉండాల్సిన అవసరం లేదా ? వంటింటి సరుకుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఆన్‌లైన్‌లో అమ్మే అమెజాన్ సంస్థ మరోసారి బరితెగించినట్టు కనిపిస్తోంది. వివాదాస్పద వస్తువులను అమ్మి జనంతో మొట్టికాయలు వేయించుకున్న అమెజాన్ సంస్థకు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. అందుకే ఆన్‌లైన్ ద్వారా అమ్మకాని కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తోంది. ఏకంగా ఉగ్రవాద సంస్థ ప్రచార సామాగ్రిని కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేసింది.
ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉగ్రవాదం
ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ కాన్సెప్టును మార్చేసి ఆన్‌లైన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసిన అమెజాన్ మల్టీనేషన్ టెక్నాలజీ సంస్థ రోజురోజుకు ప్రమాణాల విషయంలో దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. 90 శాతం మంది ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడిపోవడంతో అడ్డమైన వస్తువులను అమ్మకానికి పెట్టేస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి ఉగ్రవాదుల వస్తువులు కూడా వచ్చి చేరాయి. కొన్ని రోజుల క్రితం అమెజాన్ వెబ్‌సైట్‌లో కనిపించిన కొన్ని వస్తువులను చూసి యూజర్స్ షాక్ తిన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన లెదర్ కోస్టర్స్ ను అమ్మకానికి ఉంచారు. లష్కరే తోయిబా లోగో కూడా వాటిమీద ఉంది. రకరకాల డిజైన్లలో ఆరు రకాల లెదర్ కోస్టర్స్ ను అమెజాన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో అమ్మకానికి పెట్టారు. క్వాలిటీ లెదర్‌తో తయారు చేసినవి అంటూ డిస్క్రిప్షన్ కూడా వాటిపై రాసి ఉంది.
మరీ ఇంత బరితెగింపా ?
పాముకు పాలుపోసి పెంచినట్టు పాక్ పాలకులు లష్కరే తోయిబాను భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు పురిగొల్పితే.. అలాంటి ఉగ్ర సంస్థకు చెందిన లోగోలతో కొన్ని వస్తువులు అమెజాన్‌లో దర్శనమిచ్చాయంటే దీనిని బరితెగింపు అనుకోవాలా..లేక తెలియని తనమనుకోవాలా ? 2001లో భారత పార్లమెంట్‌పై దాడి ఘటనలో మాస్టర్ మైండ్ గా ఉన్న లష్కరే తోయిబా సంస్థను ప్రపంచంలోని చాలా దేశాలు నిషేధిత జాబితాలో పెట్టాయి. కానీ అమెరికా కేంద్రంగా నడిచే అమెజాన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మాత్రం లష్కరే తోయిబాకు చెందిన వస్తువులను దర్జాగా అమ్ముతోంది.
అమెజాన్ దృష్టిలో అదో బ్రాండ్ అనుకోవాలా ?
అమెరికా, యూరోప్‌కతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఆ సంస్థ కార్యకలాపాలపై అన్ని దేశాలు నిఘా పెట్టాయి. కానీ ఘనత వహించిన అమెజాన్‌కు మాత్రం లష్కరే తోయిబా ఓ బ్రాండ్‌గా కనిపిస్తోంది. అందుకే అనుకుంటా ఆ సంస్థను ప్రమోట్ చేసే వస్తువులను యదేచ్ఛగా అమ్మకానికి పెట్టేసింది. విధ్వంసాన్ని, దాడులను పురిగొల్పే ఎలాంటి వస్తువులను, ఉత్పత్తులను తమ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మబోమని.. అమెజాన్ పాలసీగా పెట్టుకుంది. అయితే ఆ పాలసీని తుంగలో తొక్కి మరీ అమెజాన్ వెబ్ సైట్‌లోకి ఉగ్రవాదుల లోగోలతో కూడా వస్తువులు ఎలా వస్తున్నాయి ?
అమెజాన్‌కు తెలిసే జరుగుతుందా ?
ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. అమెజాన్ తో పాటు ఏ ఇతర ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ అయినా.. కొన్ని నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. ఆ నిబంధనలకు లోబడి ఎవరైనా తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా ఇలాంటి వెబ్‌సైట్స్ లో పట్టుకోవచ్చు. అయితే తమ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఎలాంటి వస్తువులు అమ్ముడుబోతున్నాయో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయా సంస్థలదే. ఒక వస్తువును అమెజాన్‌లో అమ్మకానికి పెట్టాలంటే.. ఆ సంస్థ ఎన్నో స్క్రీనింగ్ టెస్టులు చేస్తుంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేస్తుంది. అన్నీ రూల్స్ పాస్ అయితేనే ఆయా వస్తువులను తమ వెబ్ సైట్ వేదికగా అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 10న లష్కరే తోయిబా లోగో ఉన్న వస్తువులు అమెజాన్ లో ప్రత్యక్షమయ్యాయి. అసలు అలాంటి వాటిని వెబ్ సైట్ లోకి రాకుండా చేయాల్సిన అమెజాన్ చెకింగ్ సిస్టమ్ నిద్రపోతుందనుకోవాలా ? సమస్యాత్మకమైన వస్తువులను గుర్తించేందుకు అమెజాన్ అత్యాధునికమైన రోబో టెక్నాలజీని వాడుతూ ఉంటుంది. లెదర్ కోస్టర్స్ పై లష్కరే తోయిబా అంటూ తాటికాయంత అక్షరాలతో రాసి ఉన్నా.. వాటిని అమెజాన్ చెకింగ్ సిస్టమ్ ఎలా ప్రాసెస్ చేసింది.
అమెజాన్‌కు ఇలాంటి వివాదాలు కొత్తకాదు
అత్యాచారాలు ఎలా చేయాలి..అన్న ట్యాగ్ తో ఉన్న ఓ జపాన్ సంస్థకు చెందిన వీడియో గేమ్‌ను అమెజాన్ సంస్థ 2009లో తన ప్లాట్‌ఫామ్ ద్వారా అమ్మకానికి పెట్టింది. 2010లో లవ్ అండ్ ప్లజర్ పేరుతో ఓ వివాదాస్పద పుస్తకాన్ని కూడా అమ్మకానికి ఉంచింది. ఐ లవ్ హిట్లర్ పేరుతో కొంతకాలం టీ షర్టులను కూడా అమ్మిన అమెజాన్ ఆ తర్వాత వాటిని తొలగించింది. బాంబులు ఎలా తయారు చేయాలి వంటి పుస్తకాలు.. హిందూ దేవుళ్ల బొమ్మలను ముద్రించిన అండర్ గార్మెంట్స్ ను ఇలా అనేక వివాదాస్పద వస్తువులను అమెజాన్ గతంలో అమ్మకానికి ఉంచింది. ఆన్ లైన్ షాపింగ్ ను బిలియన్ డాలర్ల బిజినెస్ గా మార్చేసిన అమెజాన్ ఉగ్రవాదులకు మద్దతిచ్చే వస్తువులను తన ఫ్లాట్‌ఫామ్ అమ్మకానికి ఉంచి విమర్శల పాలవుతుంది. రెండు రోజులకే వెబ్ సైట్ నుంచి వాటిని తొలగించినా.. జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.