మాతో పెట్టుకోవద్దు, ఆసీస్ కు జడేజా వార్నింగ్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి మొదలుకానుంది. హ్యాట్రిక్ కోసం టీమిండియా ఉవ్విళ్ళూరుతుంటే... ఎట్టపరిస్థితుల్లోనూ ఈ సారి కప్ గెలవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. తొలిసారి ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను చూసి భయపడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2024 | 04:46 PMLast Updated on: Nov 11, 2024 | 4:46 PM

Jadeja Warning To Australia

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి మొదలుకానుంది. హ్యాట్రిక్ కోసం టీమిండియా ఉవ్విళ్ళూరుతుంటే… ఎట్టపరిస్థితుల్లోనూ ఈ సారి కప్ గెలవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. తొలిసారి ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను చూసి భయపడుతోంది. ముఖ్యంగా పలువురు ప్లేయర్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అదే సమయంలో తమ జట్టులోని సీనియర్ ప్లేయర్స్ ను కూడా కొన్ని సిరీస్ లకు తప్పించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసమే రెడీ చేస్తోంది. అయితే ఇటీవల న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై వైట్ వాష్ పరాభవం తర్వాత భారత్ ను చాలా మంది మాజీలు విమర్శిస్తున్నారు. ఆసీస్ గడ్డపై సిరీస్ గెలవడం ఈ సారి కష్టమేనని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా రోహిత్ కు అండగా నిలిచాడు. ఒక్క సిరీస్ ఓటమితో హిట్ మ్యాన్ ను తక్కువ అంచనా వేయొద్దంటూ సూచించాడు. అతన్ని విమర్శించడం మానుకోవాలన్నాడు.

అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు కూడా అజయ్ జడేజా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఓటమితో ఇప్పుడు టీమిండియా మరింత ప్రమాదకరంగా మారిందంటూ వ్యాఖ్యానించాడు. ఒక్కోసారి ఓటములు వేకప్ కాల్స్ లాంటివన్నాడు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ఇండియా బెస్ట్ టీమ్ గా చెప్పాడు. ఒక్క సిరీస్ తో టీమిండియాను తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకుంటారంటూ ఆసీస్ ను హెచ్చరించాడు. ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరకున్నా ఏం కాదని, ఆసీస్ గడ్డపై మాత్రం రోహిత్ సేన సిరీస్ గెలుస్తుందన్నాడు. జట్టులో కొందరు సీనియర్లు, పలువురు యువ ఆటగాళ్ళు సరిగ్గా రాణిస్తే మాత్రం ఆసీస్ కు చుక్కలు కనిపిస్తాయని అభిప్రాయపడ్డాడు.

ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై జడేజా ప్రశంసలు కురిపించాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత పంత్ మరింత క్వాలిటీ క్రికెట్ ఆడుతున్నాడని కితాబిచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ సారి కూడా పంత్ బెస్ట్ ప్లేయర్ గా కనిపిస్తాడని అంచనా వేశాడు. ఏడాదిన్నర తర్వాత గ్రౌండ్ లో తిరిగి అడుగుపెట్టి ఫామ్ అందుకోవడం అంత సులభం కాదన్నాడు. దీనికి మానసికంగా ఎంతో సన్నద్ధత అయితే తప్ప రాణించలేమని అజయ్ జడేజా వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో బూమ్రా యువ ఆటగాళ్ళకు ఆదర్శంగా నిలుస్తాడన్నాడు. టీనేజర్ నుంచి ప్రస్తుతం స్టార్ బౌలర్ గా బూమ్రా ఎదిగిన తీరును ఖచ్చితంగా మెచ్చుకోవాలన్నాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖచ్చితంగా భారతే గెలుస్తుందంటూ జడేజా జోస్యం చెప్పాడు.