JAGAN HELICOPTERS : అప్పుడు ఆకాశంలో… ఇప్పుడు రోడ్డు మీద నేలకు దిగిన జగనన్న వైభవం…
ఒకప్పుడు... ఊ అంటే హెలికాప్టర్ ఎక్కే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత దూరమైనా కార్లల్లోనే వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కాలు బయటపడితే హెలికాప్టర్ వచ్చి వాలేది.

Jagan Mohan Reddy used to ride in helicopters, but now he travels in cars no matter how far.
ఒకప్పుడు… ఊ అంటే హెలికాప్టర్ ఎక్కే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత దూరమైనా కార్లల్లోనే వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కాలు బయటపడితే హెలికాప్టర్ వచ్చి వాలేది. కోట్ల రూపాయల ప్రజాధనం వేస్ట్ అవుతోందని ఆరోపణలు వచ్చినా… డోన్ట్ కేర్ అనేవారు. అదేదో సినిమాలో సీఎం పైన హెలికాప్టర్ లో వెళ్తుంటే… రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేస్తాడు అల్లరి నరేష్. అచ్చం అలాగే ఉండేది జగన్ టూర్ అంటే… అధికారానికి దూరమయ్యాక తెలుసొస్తోంది అసలు సంగతి.
అధికారం పోయాక మొదటిసారి సొంత నియోజకవర్గమైన పులివెందులకు వెళ్ళారు జగన్. అది కూడా రోడ్డు మీద 200 కిలోమీటర్లు ప్రయాణించారు. ఎన్నాళ్ళకో ఇలా కార్లల్లో రోడ్డు మీద వెళ్ళడం. అంతకు ముందు సీఎంగా ఉన్నప్పుడు జగన్.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు బయట పెట్టాలంటే హెలికాప్టర్ వాడే వాళ్ళు. పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరుకి వెళ్ళాలన్నా రోడ్డుమీద వెళ్ళేవారు కాదు. అంటే పట్టుమని రెండు కిలోమీటర్లు కూడా లేని ప్రాంతాలకు కూడా హెలికాప్టర్ లోనే ప్రయాణం. ఓసారి అమరావతిలో ఇళ్ళ ప్లాట్లు పంపిణీ కోసం కూడా హెలికాప్టర్ మీదే వెళ్ళారు జగన్. తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెంకు దూరం 8 కిలోమీటర్లే. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు ఉన్న వెంకటపాలెంకు… తిరిగి తాడేపల్లి చేరుకోడానికి ప్రతి చోటా హెలికాప్టర్ మీదే జగన్ ప్రయాణం సాగింది. అంటే ఆ రోజు మొత్తంలో జగన్ ప్రయాణం 30 కిలోమీటర్లు కూడా దాట లేదు. అంతతక్కువ దూరం ప్రయాణానికి హెలికాప్టర్లు వాడటం వల్ల ప్రజాధనం ఎంత వృధా అయిందో… పైగా ప్రతి చోటా హెలిప్యాడ్స్ ఏర్పాటు… రోడ్డు మార్గంలో ఆంక్షలు… కార్యకర్తలు, ప్రజల్ని తరలించడానికి ఆర్టీసీ బస్సుల వాడకం… రాజు తలచుకుంటే అన్నట్టుగా సాగింది జగన్ టూర్ల యవ్వారం. అప్పట్లో అనేవారు… జగన్ రెండు కిలోమీటర్లు వెళ్ళడానికి 400 కిలోమీటర్ల దూరం నుంచి హెలికాప్టర్ తెప్పించుకునే వాళ్ళని… ఆ రేంజ్ అలా మెయింటైన్ చేశారు మరి.
మొన్నటి ఎన్నికలకు ముందు కూడా ఏపీలో మూడు ప్రాంతాల్లో మూడు హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. పార్టీ ప్రచారం కోసమే అయినా… ప్రభుత్వ హెలికాప్టర్లలోనే వెళ్ళారు జగన్. అదేమంటే సీఎం కదా… ఆ మాత్రం సెక్యూరిటీ ఉండొద్దా అన్నారు ఆయన సలహాదారులు. తరుచుగా తాను బీదవాడిని అని చెప్పుకుంటారు జగన్. పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నానని అంటుంటారు. ఆయన చెప్పినా నమ్మేవాళ్ళు ఎవరూ లేరు గానీ… మొన్న సార్వత్రిక ఎన్నికల తర్వాత లండన్ కు వెళ్ళినప్పుడు జగన్ రేంజ్ ఏంటో మరోసారి అర్థమైంది. తన కుటుంబంతో సహా లండన్ కు … విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 అనే అత్యంత ఖరీదైన ఫ్లయిట్ లో వెళ్ళారు. దాని అద్దె గంటకు 12 లక్షలు. పైగా లండన్ లో జగన్ సెక్యూరిటీ కోసం… సిబ్బంది కూడా వెళ్ళారు. వాళ్ళ ఖర్చు కోటిన్నర ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చుపెట్టారు.
జగన్ ఒకప్పుడు జిల్లాల్లో పర్యటనకు వెళితే… రోడ్ల పక్కన జనం కనిపించకుండా పరదాలు కట్టేవారు. ఆయన జనం ముఖాలు చూడొద్దని అనుకున్నారు కాబట్టే… వైసీపీని మడిచి కూర్చోబెట్టారు ఏపీ జనం.
ఇప్పుడు జగన్ పులివెందులకు వెళ్ళడానికి హెలికాప్టర్ లేదు… రోడ్డు మీద వెళ్తుంటే పరదాలూ లేవు. పైగా పులివెందుల నుంచి బెంగళూరుకు కూడా రోడ్డు మార్గంలోనే వెళ్ళారు జగన్. ఆయన అంత అర్జెంట్ గా బెంగళూరుకు ఎందుకు వెళ్తున్నాడంటే… కాంట్రాక్టర్లు బిల్లులు అడుగుతున్నారని భయపడిపోతున్నట్టు కొందరు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కానీ… వాళ్ళమ్మాయి ఫారెన్ స్టడీస్ కి సెండాఫ్ కి ఇవ్వడానికి వెళ్తున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి జగన్ కి హెలికాప్టర్లు మోజు తీరిపోయింది… రెండు, మూడు కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళే రోజులు పోయాయి. 200 కానీయండి. 400 కిలోమీటర్లు కానీయండి… రోడ్డు మార్గాన్నే వెళ్తున్నారు. ఓడలు బళ్ళు… బళ్ళు ఓడలు అవుతాయంటే ఇదే మరి.