Pakistan, BCCI : పాక్ తోక కత్తిరించే పనిలో జై షా.. ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తోక జాడిస్తోంది. ఎట్టపరిస్థితుల్లోనూ టోర్నీని పాక్ లోనే నిర్వహించాలని పిసిబి పట్టుదలగా ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తోక జాడిస్తోంది. ఎట్టపరిస్థితుల్లోనూ టోర్నీని పాక్ లోనే నిర్వహించాలని పిసిబి పట్టుదలగా ఉంది. టోర్నీలో ఆడుతున్న 8 జట్లలో ఏడు పాక్ వెళ్ళేందుకు దాదాపు అంగీకరించినా.. భారత్ మాత్రం నో చెప్పింది. పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని ఐసీసీకి తేల్చి చెప్పేసింది. తమ మ్యాచ్ లో హైబ్రిడ్ మోడల్ విధానంలో తటస్థ వేదికలో నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేసింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం దీనిని ఒప్పుకోకూడదని భావిస్తోంది. ఒకవేళ భారత్ రాకుంటే ఆ ప్లేస్ లో శ్రీలంకను టోర్నీలో ఆడించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఐసీసీతో కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు తోక కత్తిరించేందుకు బీసీసీఐ సెక్రటరీ జైషా పావులు కదుపుతున్నాడు.
ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీపడేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి బీసీసీఐ ప్రెసిడెంట్ కావాలన్నదే జైషా టార్గెట్…. ఆ పీఠం దక్కాలంటే ముందు ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు అందుకోవాలి. అప్పుడే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో పాటు పాక్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ కు చెక్ పెట్టాలంటే కూడా ఐసీసీ బాస్ గా ఉండాల్సిందే. అందుకే ఐసీసీ ఛైర్మన్ పదవి రేసులో నిలిచినట్టు తెలుస్తోంది. ఒకవేళ జైషా ఐసీసీ బాస్ అయితే పాక్ బోర్డుకు బుద్ది చెప్పొచ్చు. అలాగే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లను తటస్థ వేదికలకు మార్చే అవకాశం కూడా ఉంటుంది.