Jana Reddy: రంగంలోకి జానారెడ్డి.. ఆ మూడు టికెట్స్ కోసం కసరత్తు !

జానా రెడ్డి కుమారులను అసెంబ్లీకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2023 | 02:15 PMLast Updated on: Aug 19, 2023 | 2:15 PM

Jana Reddy Is Trying To Bring His Sons Into Politics

జానారెడ్డి.. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకుడు. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పాలిటిక్స్ లో చక్రం తిప్పిన ఘనాపాటి. వయసు మీద పడటం, ఆరోగ్య సమస్యలు వంటి కారణాలతో గత కొన్నేళ్లుగా ఆయన పెద్దగా యాక్టివిటీస్ చేయలేదు. అయితే అసెంబ్లీ పోల్స్ సమీపించడం, అసెంబ్లీ టికెట్స్ కోసం ఆసక్తి ఉన్న లీడర్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్లు స్వీకరిస్తున్న ప్రస్తుత తరుణంలో జానారెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన ఇద్దరు కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డిలను ఎన్నికల బరిలోకి దించేందుకు అవసరమైన ప్రయత్నాలను మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇద్దరు వారసులను నాగార్జున సాగర్, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యక్రమాలు చేపడుతున్నారు. జానారెడ్డి గతంలో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన నాగార్జునసాగర్‌లో “బ్రింగ్‌ బ్యాక్ కాంగ్రెస్” పేరుతో జైవీర్ రెడ్డి ప్రజా చైతన్య యాత్ర చేశారు. జానారెడ్డికి మంచి పట్టు ఉన్న మిర్యాలగూడలో పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి
తన అనుచర గణంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో జానారెడ్డి విజయంలో వారసులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి కీ రోల్ పోషించారు.

జానారెడ్డి కోసం కాంగ్రెస్ ప్లాన్ అదేనట..

జానారెడ్డి కుమారులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ మంచి సంబంధాలు ఉండడం రాజకీయంగా కలిసొచ్చే అంశం. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నా కూడా జానారెడ్డి మాటను కాదనగల పరిస్థితి ఎవరికీ ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలా అయినా తన ఇద్దరు కుమారుల్లో ఒకరిని.. కుదిరితే ఇద్దరినీ బరిలో దించేందుకు జానారెడ్డి పావులు కదుపుతున్నారట. రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలిస్తే ప్రభుత్వంలో కీలక అవకాశం లభిస్తుందనే ఆశాభావంతో జానారెడ్డి ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే చివరి నిమిషంలో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి జానారెడ్డి బరిలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నాయి.
ఈవిషయంలో జానారెడ్డి ఇంత వరకు ప్రకటన చేయనప్పటికీ.. ఒకవేళ తండ్రి పోటీ చేస్తానంటే జైవీర్ తర్వాతి ఎన్నికల వరకు ఆగుతారని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం జానారెడ్డిని నల్లగొండ లోక్‌సభ నుంచి బరిలోకి దింపాలని ఆలోచిస్తోందట. ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో.. లోక్‌సభకు జానారెడ్డి పోటీ చేస్తే కలిసి వస్తుందని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారట.

జానారెడ్డి, కోమటిరెడ్డి టైట్ ఫైట్..

యాదాద్రి జిల్లా కాంగ్రెస్ ​అధ్యక్ష పదవి కోసం పార్టీ అగ్రనేతలు జానారెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మధ్య టైట్ ఫైట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుంభం అనిల్​రెడ్డి పార్టీ వదిలివెళ్లడంతో ఆ స్థానాన్ని తమ అనుచరులతో భర్తీ చేయాలని ఈ ఇద్దరు లీడర్లు పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి తన ప్రధాన అనుచరుడైన భువనగిరికి చెందిన ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. గుండాల మండలానికి చెందిన అండెం సంజీవరెడ్డిని డీసీసీ ప్రెసిడెంట్ చేయాలని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇప్పటికే వీళ్ల పేర్లను హైమాండ్‌‌కు పంపించారు. కసిరెడ్డి నారాయాణ రెడ్డిని పార్టీ ప్రెసిడెంట్‌‌గా చేసేందుకు జానారెడ్డి తెరవెనుక గట్టిగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పాలిటిక్స్ పై మళ్లీ పట్టు సాధించేందుకు జానారెడ్డి రెడీ అయ్యారనే దానికి ఈ పరిణామాలే పెద్ద సిగ్నల్ !