ఇన్‌స్టాలో జెర్సీ ఫోటో, జడేజా రిటైర్మెంట్ ?
కొత్త ఏడాదిలో టీమిండియా ఫ్యాన్స్ కు షాక్ తగలబోతోందా... భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా... అంటే అవుననే అనుమానాలు మొదలయ్యాయి.
కొత్త ఏడాదిలో టీమిండియా ఫ్యాన్స్ కు షాక్ తగలబోతోందా… భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా… అంటే అవుననే అనుమానాలు మొదలయ్యాయి. దీనికి కారణం జడేజా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోనే…. తన టెస్ట్ మ్యాచ్ జెర్సీ ఫోటోను జడ్డూ ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వైరల్ గా మారడంతో పాటు విపరీతమైన చర్చకు దారితీసింది. జడ్డూ రిటైర్మెంట్ హింట్ ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా జడేజా తన జెర్సీని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం చర్చనీయాంశమైంది. టెస్ట్‌లకు వీడ్కోలు పలికేందుకు జడేజా సిద్దమయ్యాడనే చర్చ మొదలైంది. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి క్రికెట్ కు జడేజా గుడ్ బై చెప్పేశాడు. తర్వాత వన్డే, టెస్టు ఫార్మాట్లలో కొనసాగుతున్నా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఒకప్పటిలా మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అటు బ్యాటర్‌గా.. ఇటు బౌలర్‌గా నిరాశపరిచాడు. ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌లు ఆడిన జడేజా 4 వికెట్లు మాత్రమే తీసి 135 పరుగులే చేశాడు. వన్డేల్లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఈ క్రమంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే జట్టులో యువ స్పిన్ ఆల్ రౌండర్ల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నాడు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వంటి ప్లేయర్స్ రెగ్యులర్ ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. వారికి అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా మొదలైంది. ఫామ్ లో లేని ఆటగాడిని ఎంతకాలం జట్టులో కొనసాగిస్తారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జడేజానే కీలక నిర్ణయం తీసుకున్నాడన్న చర్చ జరుగుతోంది.
త్వరలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలకు ఎంపికయ్యే భారత జట్లలో జడేజాకు చోటు దక్కదనే ప్రచారం కూడా నడుస్తోంది. ఒకవేళ ఛాన్స్ దక్కినా ఇదే అతనికి చివరి సిరీస్ కావొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జడేజా తన రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారానికి తగ్గట్లు జడేజా జెర్సీ ఫొటోను పంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫొటోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నాడు. హ్యాపీ రిటైర్మెంట్ డే జడేజా అని విష్ చేస్తున్నారు. 2012లో ఇంగ్లాండ్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన జడ్డూ ఇప్పటి వరకు 80 టెస్ట్‌లు ఆడాడు. 3, 370 పరుగులు చేసి 323 వికెట్లు పడగొట్టాడు.