Jr. NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ ఫ్యాన్స్.. తారక్ సినిమాలు బాయ్‌కాట్.. మరీ ఓవర్‌గా లేదు ?
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తాలూకు ఎఫెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై పడిందా. తెలుగు దేశం అభిమానులు ఏమంటున్నారు.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. స్కిల్ స్కామ్ గురించి.. జగన్ సర్కార్ తీరు గురించి.. ఆ తర్వాత పరిణామాల గురించి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఢిల్లీ వరకు వెళ్లింది చర్చ. ఐతే చంద్రబాబు అరెస్ట్ అయి దాదాపు వారం అవుతున్నా.. ఇప్పటివరకు ఎన్టీఆర్ రియాక్ట్ కాకపోవడం.. కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం.. పైగా మామ చంద్రబాబు జైల్లో ఉంటే విదేశాలకు ఫ్యామిలీ కలిసి టూర్ వెళ్లడం.. కొత్త డిస్కషన్‌కు కారణం అయింది. నందమూరి, నారా కుటుంబాలను ఎన్టీఆర్ దూరం పెట్టారా.. లేదంటే పూర్తిగా వదిలేశారా అనే చర్చ జరుగుతోంది.
ఇక సోషల్ మీడియాలోనూనే ఇదే రచ్చ. ఎన్టీఆర్‌కు పాజిటివ్‌గా కొందరు.. నెగిటివ్‌గా మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. వెళ్లాలో లేదో అన్నది ఎన్టీఆర్ ఇష్టం అని.. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటుంటే.. చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం రియాక్ట్ కాని తారక్‌కు.. ఎన్టీఆర్ అనే పేరు పెట్టుకునే హక్కు లేదని.. పేరు మార్చుకోవాలని మరికొందరు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇది ఇప్పుడు మరింత ముదిరింది. రెండు కుటుంబాలు వ్యవహారం కాస్త.. రెండు అభిమాన వర్గాల మధ్య యుద్ధానికి దారి తీస్తోంది. ఇకపై జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసేది లేదని టీడీపీ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకాలం తారక్‌కు తాము అండగా నిలిచామని.. ఇకపై అండగా నిలబడే ఛాన్స్ లేదని తెగేసి చెప్తున్నారు. ఐతే అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తగ్గేదే లే అంటున్నారు.
ఇలాంటి కామెంట్లు చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తున్నారు. సినిమా చూడాలో వద్దో వ్యక్తిగత ఇష్టమని.. సినిమా చూడాలని ఎవరూ బలవంతం చేయరని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక అటు జూనియర్ ఎన్టీఆర్‌ను అనవసర వివాదాల్లోకి, రాజకీయాల్లోకి లాగొద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ గురించి ఇంకా చాలామంది స్పందించలేదని.. కానీ ఎన్టీఆర్‌నే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ గతంలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడని.. విమర్శించే వాళ్లు ఆ విషయాలను కూడా గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ ప్రభావం తారక్ తర్వాత సినిమాల మీద చూపిస్తుందా అనే చర్చ మొదలైంది. కొరటాల శివ డైరెక్షన్లో తారక్ ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రాబోతోంది.