సచిన్ ను అపార్థం చేసుకున్నా, తన కోసం ఎంతో చేసాడన్న కాంబ్లీ
స్నేహితుల మధ్య మనస్పర్థలు అపార్థాల వల్లనే వస్తాయి.. భారత క్రికెట్ లో స్కూల్ స్థాయి నుంచే మంచి ఫ్రెండ్స్ గా ఉన్న సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ స్థాయిలోనూ తమ స్నేహాన్ని కొనసాగించారు.
స్నేహితుల మధ్య మనస్పర్థలు అపార్థాల వల్లనే వస్తాయి.. భారత క్రికెట్ లో స్కూల్ స్థాయి నుంచే మంచి ఫ్రెండ్స్ గా ఉన్న సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ స్థాయిలోనూ తమ స్నేహాన్ని కొనసాగించారు. కానీ సచిన్ తన క్రికెట్ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఎవరెస్ట్ స్థాయి వరకూ ఎదిగితే… చెడు అలవాట్లు, క్రమశిక్షణా రాహిత్యంతో కాంబ్లీ తన కెరీర్ నే పోగొట్టుకున్నాడు. ఎంతో టాలెంట్ ఉండి కూడా అర్థాంతరంగానే కెరీర్ ను ముగించాల్సి వచ్చింది. ప్రస్తుతం వయసు మీద పడడంతో పాటు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో చాలామంది సచిన్ అతన్ని ఆదుకోవచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కానీ చాలా మందికి తెలియని పలు విషయాలను ఇప్పుడు కాంబ్లీనే స్వయంగా వెల్లడించాడు.
సచిన్ ను తానే అపార్థం చేసుకున్నట్టు చెప్పాడు. మంచి స్థితిలో ఉండి తనకు సాయం చేయలేకపోయాడంటూ బాధపడ్డాడనని, అదంతా తప్పని తర్వాత తెలిసిందదన్నాడు. తన కోసం సచిన్ ఎంతో చేశాడని, రెండుసార్లు సర్జరీ కోసం అతనే బిల్లు చెల్లించిన విషయాన్ని కాంబ్లీ వెల్లడించాడు. గత వారం ఓ కార్యక్రమంలో సచిన్ చేతిని పట్టుకున్న కాంబ్లీ విడిచిపెట్టేందుకు నిరాకరించిన వీడియో వైరల్ అయింది. అందులో కాంబ్లీ గుర్తుపట్టలేనంతగా ఉన్నాడు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని, బీసీసీఐ నెలకు ఇచ్చే రూ. 30 వేల పెన్షన్‌తో ఇద్దరు పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నట్టు చెప్పాడు.
కాగా కాంబ్లీ ఆరోగ్య, ఆర్థిక పరిస్థితిపై స్పందించిన కపిల్‌దేవ్.. అతడు అంగీకరిస్తే 1983 నాటి జట్టు అతడిని ఆదుకుంటుందని చెప్పాడు. అయితే కాంబ్లీ తన వ్యసనాల నుంచి బయటపడేందుకు మొదట రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్ళాలని సూచించాడు. అటు కపిల్ ఆఫర్‌పై సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు. కాంబ్లీకి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో కాంబ్లీ మాట్లాడుతూ పునరావాసం అందుకునేందుకు తనకు ఎలాంటి సంశయం లేదని, కుటుంబం తోడున్నంత వరకు ఎవరికీ, దేనికీ భయపడబోనని చెప్పాడు. పునరావాసం పూర్తిచేసుకుని తిరిగి వస్తానని చెప్పుకొచ్చాడు.