కాంబ్లీకి హెల్ప్ చేస్తా, ఓ కండీషన్ పెట్టిన కపిల్ దేవ్

భారత క్రికెట్ వినోద్ కాంబ్లీ గురించి ఫ్యాన్స్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సచిన్ తో కలిసి స్కూల్ స్థాయిలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తర్వాత జాతీయ జట్టులోనూ అడుగుపెట్టి భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ వ్యసనాలతో ఆటపై ఫోకస్ తగ్గి కెరీర్ ను ముగించాల్సి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2024 | 01:44 PMLast Updated on: Dec 06, 2024 | 1:44 PM

Kapil Dev Sets One Condition He Will Help Kambli

భారత క్రికెట్ వినోద్ కాంబ్లీ గురించి ఫ్యాన్స్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సచిన్ తో కలిసి స్కూల్ స్థాయిలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తర్వాత జాతీయ జట్టులోనూ అడుగుపెట్టి భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ వ్యసనాలతో ఆటపై ఫోకస్ తగ్గి కెరీర్ ను ముగించాల్సి వచ్చింది. టీమిండియా స్టార్ బ్యాటర్‌గా ఓ వెలుగు వెలిగిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడి అనారోగ్య సమస్య ఏంటో బయటకు వెల్లడి కాలేదు, కానీ అతడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కాంబ్లీకి సంబంధించిన పలు వీడియోలు కూడా ఇటీవల వైరల్ అయ్యాయి. తాజాగా రమాకాంత్ అచ్రేకర్ స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమానికి కాంబ్లీ హాజరయ్యాడు. సచిన్ తో కలిసి వేదికపై కనిపించినా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

వినోద్ కాంబ్లీ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగానూ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. బీసీసీఐ ఇచ్చే పింఛనుతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కాంబ్లీ గతంలో పేర్కొన్నాడు. వినోద్‌ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంబ్లీ చికిత్స కోసం సాయమందించేందుకు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ముందుకొచ్చాడు. అతనికి హెల్ప్ చేస్తానని, కానీ ఓ కండీషన్ పెడుతున్నట్టు చెప్పాడు. ఈ విషయాన్ని కాంబ్లీ సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. వినోద్ కాంబ్లీ వైద్యానికి అయ్యే ఖర్ఛు భరించేందుకు కపిల్ దేవ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే కాంబ్లీ ముందు రిహాబిలిటేషన్ లో జాయిన్ కావాలని కోరారు.

వ్యక్తిగత జీవితంలో వివాదాలతో కాంబ్లీ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఈ కారణంగానే అనారోగ్యం పాలయ్యాడు. అందుకే మద్యం సేవించడం మానేస్తే తప్ప కాంబ్లీ ఆరోగ్యం బాగుపడేలా లేదని అతని సన్నిహితులు చెబుతున్నారు. కపిల్ దేవ్ ఇదే కండీషన్ పెట్టి ట్రీట్ మెంట్ ఖర్చుకు సాయం అందిస్తానని చెప్పినట్టు వెల్లడించారు. తాజాగా కాంబ్లీ, సచిన్ ను పట్టుకుని భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ గా మారింది.