KNR POWER FIGHT : ఈ సారి కరీంనగర్ లో గెలిచే కింగ్ ఎవరు..?
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, BRS మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. కరీంనగర్ లో గతంలో జరిగిన ఏ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా... ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి విజయం సాధించలేదన్న సెంటిమెంట్ ఉంది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మాత్రం... మళ్ళోసారి గెలిచి ఆ సెంటిమెంట్ ను తుడిచేస్తా అంటున్నారు.
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, BRS మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. కరీంనగర్ లో గతంలో జరిగిన ఏ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా… ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి విజయం సాధించలేదన్న సెంటిమెంట్ ఉంది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మాత్రం… మళ్ళోసారి గెలిచి ఆ సెంటిమెంట్ ను తుడిచేస్తా అంటున్నారు. 15యేళ్ళ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల… ఓడిన చోటే మళ్ళీ గెలవాలన్న గట్టి పట్టుదలతో వినోద్ కుమార్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. మూడు పార్టీల ప్రచారంతో మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. మరి కరీంనగర్ లో ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతోందో చూద్దాం.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఓటర్లు ఒకసారి గెలిపించిన పార్టీని… వరుసగా రెండోసారి గెలిపించరు అన్న సెంటిమెంట్ ఉంది. గత పాతికేళ్ళల్లో జరిగిన ఎన్నికల్లో… ఒక్క బైపోల్ తప్ప మిగతా ఆరు ఎలక్షన్స్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. 1996 నుంచి 2019 ఎన్నికల వరకూ ఇదే పద్దతి కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు… నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. ఈ టైమ్ లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మళ్ళీ గెలిచి… సెంటిమెంట్ కు బ్రేక్ వేస్తారా… లేకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒకరు ఈ సీటు గెలుచుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం 17 లక్షల 89 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో… ఈ లోక్ సభ సెగ్మెంట్ లో ఉన్న వేములవాడ, చొప్పదండి, హుస్నాబాద్, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకుంది. కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. కరీంనగర్ లో 2019లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎంపీగా గెలిచారు. అయితే మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిలబడి 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో గెలవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రజాహిత యాత్ర ద్వారా ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఒకసారి చుట్టివచ్చారు.
అయోధ్య రామమందిరం నిర్మాణం, నేషనల్ హైవేల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం విడుదల చేసిన 12 వేల కోట్లు తానే సాధించినట్టు బండి సంజయ్ చెబుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ పై తాను చేసిన పోరాటం, తనపై పెట్టిన కేసులను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు బండి సంజయ్. ఆయనది ప్రచారమే తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. అయితే బండి సంజయ్ కు సీనియర్ నేతలెవరూ కలసి రావడం లేదు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే… బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ ఆయన వర్గీయులు చెబుతున్నారు.
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును నిలబెట్టింది అధిష్టానం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు… కోహినూర్ కరీంనగర్ పేరుతో, వెలిచాల విజన్ పేరుతో 23 సొంత గ్యారంటీలను విడుదలచేశారు.. రాజేందర్ రావు. సమస్యల పరిష్కారానికి కరీంనగర్ సహాయక్ యాప్, విద్యార్థుల పోటీ పరీక్షలకు శిక్షణ, మెగా జాబ్ క్యాంప్స్ లాంటి హామీలు ఇందులో ఉన్నాయి. వెలిచాల గెలుపు బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో ఆయనే పోటీలో ఉన్నట్టుగా భావించి ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఇక ఉద్యమ కాలం నుంచీ కేసీఆర్ కు కరీంనగర్ పెద్ద సెంటిమెంట్ గా ఉంది. ఆ పార్టీకి మొన్న మొన్నటిదాకా కంచుకోటగా కూడా ఉంది. అందుకే ఇక్కడ వినోద్ కుమార్ గెలిస్తే… ప్రస్తుతం నిస్తేజంలో ఉన్న BRS కి ఊపు వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గతంలో బండి సంజయ్ మీద ఓడిన వినోద్ కుమార్… మళ్ళీ గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన పనులను వినోద్ కుమార్ జనానికి వివరిస్తున్నారు.
నేషనల్ హైవేస్, స్మార్ట్ సిటీ, రైల్వే లైన్ మంజూరు చేయించినట్టు చెబుతున్నారు. నియోజకవర్గంలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులే ఉండటంతో తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో కొందరి ఎమ్మెల్యేల అక్రమాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇవి బయటపడుతున్నాయి. వీటితో పాటు కొందరు BRS నేతలు హస్తం పార్టీలోకి చేరుతుండటంతో… ఉద్యోగాలు, కబ్జాల పేరుతో వినోద్ కుమార్ బంధువులపై వస్తున్న ఆరోపణలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. కరీంనగర్ లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్… మూడు పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపుపై సంజయ్, వెలిచాల, వినోద్ కుమార్… ఎవరికి వారే ఆశలు పెట్టుకున్నారు. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.