National Partys: కష్టం వీళ్లది.. పెత్తనం వాళ్లది.. జాతీయ పార్టీలతో ఇదే తలనొప్పి!
సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుంటుంది జాతీయ పార్టీల తీరు. రాష్ట్ర నేతలు రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తే నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం హైకమాండ్‌దే. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు పార్టీలది అదే తీరు.
అదేంటి రాహుల్ గాంధీ కూడా కష్టపడ్డాడు కదా.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడోయాత్ర చేశాడు కదా.. అలాంటప్పుడు కర్ణాటక సీఎం ఎవరవ్వాలో ఆయన నిర్ణయం తీసుకుంటే తప్పేంటి.? నిజమే రాహుల్ గాంధీ కష్టపడ్డ మాట వాస్తవమే..! ఆయన లేకుంటే డీకే శివకుమార్, సిద్ధిరామయ్యా అసలు కలిసికట్టుగా పార్టీని నడిపించేవాళ్లే కాదు..కర్ణాటకలో జోడో యాత్ర సాగిన ప్రతీచోటా కాంగ్రెస్‌పార్టీకి ఓట్లు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయి. వీటిని అందరూ అంగీకరించాల్సిందే. అయితే ప్రతీసారీ.. గెలిచిన ప్రతి రాష్ట్రంలో సీఎం ఎవారవాలన్నది సోనియా, రాహులే నిర్ణయిస్తున్నారు.. ఇప్పుడంటే జోడో యాత్రను చూపిస్తున్నారు కానీ..గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నది అదిష్టానమే కదా!
ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకోవాలి. మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ సీఎంగా ఎన్నుకుంటోరో వాళ్లే ముఖ్యమంత్రి కుర్చిలో కూర్చోవాలి. ఇది రూలూ. అయితే జాతీయ పార్టీల మనసత్త్వం వేరేలా ఉంటుంది. ‘మేం చెప్పినోడే సీఎం.. అందరూ సచ్చినట్లు ఒప్పుకోవాల్సిందే..’అన్నట్లుంటుంది వాళ్ల బిహేవియర్. రాష్ట్ర నేతలు కూడా తప్పదన్నట్లు తలవంచే ఉంటారు. లేకపోతే రాజకీయ గూడు ఉండదు.. వేరే పార్టీలోకి మారాల్సి ఉంటుంది. ఇదో టైప్ ఆఫ్ పెత్తందారి వ్యవస్థ. పెత్తానాలు చేసే వాళ్లు ప్రతీచోటా ఉంటారు. ఢిల్లీలో కాస్త ఎక్కువగా ఉంటారు. అక్కడ నుంచే ఆదేశాలు ఇస్తుంటారు.. టీవీ రాష్ట్రంలోనే ఉంటుంది కానీ..రిమోట్ మాత్రం ఢిల్లీలో ఉంటుంది. వాళ్లు నొక్కిందే ఛానల్, వాళ్లు ఆడిందే ఆట.. వాళ్లు కుర్చోమంటే కుర్చోవాలి.. పక్కకు పొమ్మంటే పక్కకు పోవాలి.. లేదా ‘గెట్ అవుట్’ అంటారు.
కర్ణాటక సీఎంగా సిద్ధిరామయ్యే ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటూ ఉండవచ్చు..లేదా డీకే శివకుమారే ఉండాలని పట్టుబడుతూ ఉండవచ్చు..! అయితే ఇదంతా మాకేందుకు.. మాకు నచ్చినోడికే సీఎం పదవి ఇస్తాం.. రాజస్థాన్‌లో గహ్లోట్‌కు అలానే ఇచ్చాం. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాను చికాకుపెట్టి పార్టీని వీడేలా చేశాం..! శివకుమారైనా.. సచిన్ పైలెటైనా మా కింద పనిచేయాల్సిందే.. మేం చెప్పినట్లు వినాల్సిందే..! ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు.. పార్టీ హైకమాండ్‌దే అల్టిమేట్ డిసిషన్ కదా.. మధ్యలో ఈ ఎమ్మెల్యేల గోలేంటి.. అదిష్టానం నిర్ణయం తీసుకుంటే అది పెత్తనం ఎలా అవుతుందన్న అనుమానం వస్తే చేయగలిగిందేమీ లేదు..! ఒకసారి రాజ్యాంగం ఓపెన్ చేయడం తప్ప అలాంటివాళ్లకి సాధారణ మనుషులు చెప్పే మాటలేమీ లేవు..రాజ్యాంగమంటే భారత్ రాజ్యాంగం.. కాంగ్రెస్,బీజేపీ రాజ్యాంగాలు కావు..! నిజానికి ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారో పార్టీ హైకమాండ్ అడిగి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పెత్తందారితనం లేనట్లే కానీ.. అడిగినా.. అడగకపోయినా.. మేము తీసుకోవాల్సిన నిర్ణయమే తీసుకుంటామనుకుంటే ఇంకా అడగడం దేనికి!