బీసీసీఐ సెలక్షన్ కమిటీకి కరణ్ నాయర్ సవాల్ విసురుతున్నాడు. భీకర్ ఫామ్ తో పరుగుల వరద పారిస్తూ వారికి తలనొప్పిగా మారాడు. దేశవాళీ క్రికెట్ లో ప్రదర్శనతోనే జట్టు ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని కోచ్ గంభీర్ గతంలోనే చెప్పిన నేపథ్యంలో కరుణ్ నాయర్ ఫామ్ ప్రస్తుతం సెలక్టర్లకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. గతంలో ఒకసారి జట్టులోకి వచ్చినా తన స్థానాన్ని నిలుపుకోవడంలో అతను విఫలమయ్యాడు. రీఎంట్రీపై దాదాపు ఆశలు వదిలేసుకున్న వేళ దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించడం అతనికి ఆశలు మొదలయ్యాయి. ముఖ్యంగా విజయ్ హజారే టోర్నీలో కరుణ్ నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. విదర్భ జట్టును లీడ్ చేస్తున్న కరుణ్ నాయర్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 752 పరుగులు చేశాడు. వరుసగా 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, 112, 122 నాటౌట్, 88 నాటౌట్‌లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. మహారాష్ట్రతో రెండో సెమీఫైనల్లో అయితే కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరుణ్ విధ్వంసం ధాటికి విదర్భ 50 ఓవర్లలో 3 వికెట్లకు 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్. ఓవరాల్ గా విజయ్ హజారే టోర్నీలో ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేయగా.. ఒకసారి మాత్రమే ఔటయ్యాడు. కరుణ్ నాయర్ సూపర్ ఫామ్ నేపథ్యంలో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. గతంతో భారత్ తరఫున అతను టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత అతనికి సరైన అవకాశాలు రాలేదు. 2016లో టెస్ట్ అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ 2017లో చివరి మ్యాచ్ ఆడాడు. 6 టెస్టుల్లో 374 పరుగులు చేసిన కరుణ్ నాయర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ టీమిండియా రేసులో నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వకపోతే సెలెక్టర్లు విమర్శలు ఎదుర్కోవడం ఖాయం. అతని సూపర్ ఫామ్ ఇప్పుడు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీకి తలనొప్పిగా మారింది. అయితే ఇప్పటికే పలువురు యువ ఆటగాళ్ళు, సీనియర్లు పోటీపడుతున్న నేపథ్యంలో అతనికి చోటు దక్కడం కష్టమేనని పలువురు మాజీలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు అవకాశం ఇవ్వొచ్చన అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.[embed]https://www.youtube.com/watch?v=PsuiFMd4A-s[/embed]