kcr birthday @69: చిన్నకార్యకర్త నుంచి ఉద్యమమే ఊపిరిగా కేసీఆర్ ప్రస్థానం – నేడు దేశ రాజకీయాపై దృష్టి ఎలా సాధ్యమో..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బాల్యం నుంచి దేశ రాజకీయాల వరకూ పూర్తి రాజకీయ ప్రస్థానం క్లుప్తంగా..
KCR అంటే మూడు అక్షరాలు కాదు. ఆయన ఒక స్వప్నం, ఒక లక్ష్యం, ఒక సంకల్పం, ఒక వ్యూహం, ఒక పోరాటం. చిన్న నాయకడుగా ప్రారంభమై నేడు దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని ముందుండి నడిపించి కొన్ని దశాబ్ధాలుగా నెరవేరని కలను సాకారం చేసి చూపించారు. ఆయన తీసుకునే నిర్ణయం ఒక తుఫాను. అతని మౌనం ప్రళయం. అతని వ్యూహం ప్రత్యర్థులకు దడ. రాజకీయాల్లో తలపండిన వారిని సైతం తలదన్నేలా ఆయన నిర్ణయాలుంటాయి. ఇంకేంకావాలి నాయకుడిగా ఇంతకన్నా గొప్ప రాజనీతి ఉంటుందా. ఈయన జీవిత పాఠం కొత్తగా వచ్చే యువ రాజకీయ నాయకులకు భవిష్యత్తుకు దిక్సూచిగా ఉపయోగపడుతుంది.
కాంగ్రెస్ నుంచి టీడీపీకి ప్రయాణం:
తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1954 ఫిబ్రవరి 17వ తేదీన సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు. సొంత జిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్న తనంనుంచే సాహిత్యం, కళలు, భాష, రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో లిటరేచన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా రాజకీయ తొలి అడుగు వేశారు. ఎన్టీఆర్ అంటే వీరాభిమానం. ఆయన స్ఫూర్తితో అన్నగారు పెట్టిన తెలుగుదేశంలో చేరారు. 1983లో అప్పటి మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. 1985లో అదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ఇక అప్పటినుంచి నిర్విరామ అపజయాలు ఎరుగని నేతగా ఎదిగారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1987-88లో మొదటిసారి కరువుశాఖ మంత్రిగా పనిచేశారు. 1989, 1994 ఎన్నికల్లో మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో 1996లో రవాణా శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. 1999, 2001లో జరిగిన ఎన్నికల్లో మరో సారి అసెంబ్లీకి ఎన్నికై అసెంబ్లీ స్పీకర్ గా విధులు నిర్వర్తించారు.
ఉద్యమరాజకీయాల్లో కీలకపాత్ర:
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 21న తెలుగుదేశం పార్టీని వీడారు. డిప్యూటి స్పీకర్ పదవిని సైతం తృణప్రాయంగా పక్కన పెట్టారు. 2001 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీ స్థాపించారు. 2001కి ముందు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ రాజకీయాల్లో కీలకభూమిక పోషించారు. 2004లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఘనవిజయం సాధించారు. దాదాపు పుష‌్కరకాలంపాటూ ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తన భుజస్కాందాలపై వేసుకొని నడిపించారు. 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షను చేసేందుకు పోలీసులు సహకరించలేదు. అరెస్ట్ చేసినా ఆసుపత్రిలో తన దీక్షను కొనసాగించారు. దీంతో తెలంగాణ ఉద్యమం మరింత వేడెక్కింది. ఎటు చూసినా ప్రత్యేక రాష్ట్ర నినాదమే వినిపించేది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ పార్లమెంట్ లో తీర్మానం చేసింది. ఇంతటితో కేసీఆర్ దీక్ష విరమించారు. అపై ఉద్యమానికి బలం చేకూర్చడం కోసం తనదైన వ్యూహ చతురతను ప్రదర్శించారు. అన్నిపార్టీలను ఒక్కతాటపైకి తీసుకొచ్చి తెలంగాణ నినాదాన్ని హోరెత్తించారు. ఇక చెప్పేదేముంది కేసీఆర్ ప్లన్ ఫలించింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది.
దేశ రాజకీయాల వైపుకు అడుగులు:
రాష్ట్ర సాధనతో ఆగిపోలేదు. ఏదో చేయాలనే తపనతో 2014 ఎన్నికల్లో స్థానికత అనే జెండాను, అభివృద్ది అనే జెండాలతో ప్రచారానికి వెళ్లారు. తెలంగాణ ప్రజలు ఉద్యమ సింహం కేసీఆర్ ని అధికారపీఠంపై కూర్చోబెట్టారు. తొలిసారి పాలనపగ్గాలు చేపట్టాక పూర్తిగా సంక్షేమ, అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో శరవేగంగా పనులు చేపట్టారు. అనుకున్నట్లే అభివృద్ది రథాన్ని ముందుకు వెళ్తున్న సమయంలో సంక్షేమానికీ పెద్దపీట వేశారు. మిషన్ భగీరధ, రైతుబంధు, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, వృద్దుల పెంఛన్ ను పెంచారు. ప్రతి ఒక్కరికీ లబ్థిచేకూరేలా పరిపాలన సాగించారు. మరోసారి అధికారమే లక్ష్యంగా ఆరునెలల సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని రద్దుచేసి 2018లో ప్రజాభిప్రాయం తెలుసుకునేదుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2018లోనూ ప్రజలు కేసీఆర్ నే కోరుకున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణను దేశానికి రోల్ మాడల్ లా చూపిస్తానంటూ టీఆర్ఎస్ పార్టీని కాస్త 2022లో బీఆర్ఎస్ గా మార్చేశారు. దేశ రాజకీయాలపై తన వ్యూహాత్మక బాణాన్ని ఎక్కుపెట్టారు. ప్రతి ప్రాంతీయ పార్టీల నాయకులతో, ముఖ్యమంత్రులతో చర్చలు కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ బహిరంగసభలను ఏర్పాటు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను తనవైపుకు ఆకర్షించుకునేందుకు కార్యాచరణలు, ప్రణాళికలు రచిస్తున్నారు.
తన మాటలు, చేష్టలు, వ్యూహాలు, ప్రణాళికలు, సంప్రదింపులు, అభివృద్ది, సంక్షేమం తెలంగాణ రాష్ట్రప్రజలను ఆకర్షించినంతగా జాతీయ పార్టీ నాయకులకు, దేశ ప్రజలకు ఆకర్షిస్తాయా.. బీఆర్ఎస్ ను కేంద్రంలో చక్రం తిప్పేపార్టీగా నిలబెడుతాయా అనేది కాలమే నిర్ణయించాలి.
T.V.SRIKAR