Kesineni Nani: వైసీపీలోకి కేశినేని నాని.. ముహూర్తం ఫిక్స్!
కొంతకాలంగా టీడీపీకి తలపోటుగా మారింది కేశినేని నాని వ్యవహారం. ఆయన ఉన్నా లేనట్లే అన్నట్లు ఉన్నారు ఇన్నాళ్లు ! ఇప్పుడు ఉండి.. ఇకపై ఉండను అని సంకేతాలు పంపుతున్నారు.
చదవడానికి, వినడానికి కన్ఫ్యూజింగ్‌గా ఉన్నా.. నాని తీరు చూస్తే అర్థం అవుతోంది ఇదే ! టీడీపీ మీద కొన్నేళ్లుగా గుర్రుగా కనిపిస్తున్న నాని.. పార్టీకి దూరంగానే ఉంటున్నారు. రాజకీయాలకు దూరం అవుతారు అనుకుంటే.. ఇప్పుడు వైసీపీకి దగ్గరవుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రశంసిస్తున్నారు.. జగన్ మీద ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఏంటి ఇది అని ప్రశ్నిస్తే మాత్రం.. అవసరం అయితే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా.. అభివృద్ధి గెలిపిస్తుందని డైలాగులు వదులుతున్నారు. ఐతే అసలు సీన్ మాత్రం వేరు. వైసీపీలో చేరేందుకు దాదాపు లైన్ క్లియర్ చేసేసుకున్నారు నాని. తన సోదరుడు కేశినేని చిన్నికి మద్దతుగా నిలులస్తూ.. టీడీపీలోని కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. కొద్దిరోజులుగా నాని గుర్రు మీద ఉన్నారు.
ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈయన వాళ్ల మీద ప్రశంసలు గుప్పించేది.. వాళ్లు ఈయనను పొగడ్తలతో ముంచెత్తుతూ రండి రండి అని ఆహ్వానించేది అందుకే ! వైసీపీలో కేశినేని నాని చేరికకు సంబంధించి ముహూర్తం దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా.. ఫ్యాన్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని తన అనుచరులతో రూట్ మ్యాప్ ప్రకారం భేటీ అయి.. ఆ తర్వాత వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
జూన్ 4న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అనుచరులతో భేటీ కాబోతున్నారు. వైసీపీలో చేరబోయేది ఎప్పుడు అన్నది ఆ మీటింగ్ తర్వాత క్లారిటీ రానుంది. రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత టీడీపీ తీరు మీద.. గుర్రుగా కనిపిస్తున్నారు కేశినేని నాని. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు తనకు దూరంగా జరిగి.. ఆయన తమ్ముడు చిన్నికి మద్దతుగా నిలుస్తున్నారన్న కోపం నానిని వెంటాడుతోంది. అందుకే చంద్రబాబు మీద, పార్టీ మీద చాలాసార్లు ఘాటు విమర్శలు చేశారు. పార్టీ మీటింగ్‌లకు దూరంగా ఉన్నారు.. మహానాడులోనూ ఎక్కడ నాని కనిపించలేదు! దీంతో వైసీపీలోకి వెళ్లి టీడీపీ మీద తన ప్రతీకారం తీర్చుకోవాలని కేశినేని నాని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు.
ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాననే మాటలన్నీ ఉత్తవేనని.. కేశినేని బస్సు వెళ్లి ఆగేది ఫ్యాన్ పార్టీ స్టాప్‌లోనే అనే చర్చ జరుగుతోంది బెజవాడ రాజకీయాల్లో ! కేనినాని పార్టీలో చేర్చుకోవడం వెనక టీడీపీని భారీ టార్గెట్ చేసేలా వైసీపీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీని ముందు నిలబెట్టి.. టీడీపీ ఉతికి ఆరేస్తోంది వైసీపీ. వాళ్లిద్దరితో పాటు.. వాళ్లిద్దరి సరసన కేశినేని నానిని కూడా చేర్చి.. సైకిల్‌కు పంక్చర్లు వేయాలి జగన్ అండ్ కో భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని పూర్తిగా దెబ్బతీయాలన్నది జగన్ ప్లాన్. కేశినేని నాని వైసీపీలో చేరితే.. రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయం. 2024 ఎన్నికల్లో బెజవాడ పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని బ్రదర్స్ ఫైట్ ఆసక్తికరంగా మారడం కూడా ఖాయం.