కింగ్ కోహ్లీ @ 14000 సచిన్ రికార్డు గల్లంతు

సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గత ఏడాది కాలంగా తనదైన బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగాటోర్నీలో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2025 | 10:37 AMLast Updated on: Feb 24, 2025 | 10:37 AM

King Kohli Beat Sachins Record

సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గత ఏడాది కాలంగా తనదైన బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగాటోర్నీలో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇంగ్లాండ్ తో చివరి వన్డేలో టచ్ లోకి వచ్చిన కోహ్లీ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఫెయిలయ్యాడు. కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో మాత్రం సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో విరాట్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 15 ప‌రుగుల వ‌ద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. హారిస్ ర‌వూఫ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి స‌చిన్, సంగ‌క్క‌ర‌ల రికార్డుల‌ను బ్రేక్ చేశాడు.
స‌చిన్ టెండూల్క‌ర్ 350 ఇన్నింగ్స్‌ల్లో 14 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకోగా కోహ్లీ 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఇక వ‌న్డేల్లో ఇద్ద‌రు క్రికెట‌ర్లు మాత్ర‌మే 14 వేల కంటే ఎక్కువ ప‌రుగులు చేయ‌గా ఇప్పుడు కోహ్లీ మూడో ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కాడు.

వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా మాజీ క్రికెటర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నాడు. సచిన్ 463 వ‌న్డే మ్యాచ్‌ల్లో 44.8 స‌గ‌టుతో 18,426 ప‌రుగులు సాధించాడు. ఇందులో 49 సెంచ‌రీలు, 96 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో శ్రీలంక దిగ్గ‌జ ఆట‌గాడు కుమార సంగ‌క్క‌ర ఉన్నాడు. సంగ‌క్క‌ర 404 వ‌న్డే మ్యాచ్‌ల్లో 42 స‌గ‌టుతో 18 వేల 48 ప‌రుగులు చేశాడు. ఇందులో 25 శ‌త‌కాలు, 93 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక కోహ్లీ 299 వ‌న్డే మ్యాచ్‌ల్లో 57.8 స‌గటుతో 14000 ప‌రుగులు చేశాడు. ఇందులో 50 సెంచ‌రీలు 73 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. కాగా పాక్ తో మ్యాచ్ అంటే చెలరేగిపోయే కోహ్లీ దుబాయ్ లోనూ ఆకట్టుకున్నాడు. గతంలో కోహ్లీ పాకిస్తాన్ పై 16 వన్డేల్లో 52.15 సగటుతో 678 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇదే మ్యాచ్ లో విరాట్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఫీల్డింగ్ లో భారత్ తరపున వన్డేల్లో బెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. పాక్ తో మ్యాచ్ లో రెండు క్యాచులు పట్టిన కోహ్లీ.. భారత తరుఫున వన్డేల్లో అత్యధిక క్యాచులు పట్టిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు మీద ఉండగా.. దాన్ని కోహ్లీ అధిగమించాడు. ఇదిలా ఉంటే ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక క్యాచులు పట్టిన ప్లేయర్ గా శ్రీలంకకు చెందిన జయవర్థనేపేరు మీద ఉండగా..ఆ తర్వాత రికీ పాంటింగ్ 160 క్యాచ్ లో రెండో స్థానంలో ఉన్నాడు.