రికార్డుల వేటలో కింగ్ కోహ్లీ, ఊరిస్తున్న బ్రాడ్‌మన్ ఫీట్

సొంతగడ్డపై ఎవ్వరైనా కొడతారు... విదేశాల్లో పరుగుల వరద పారిస్తే ఆ కిక్కే వేరు.. ఈ మాటలు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతాయి. ఇటీవల బంగ్లాదేశ్, కివీస్ తో సిరీస్ లలో నిరాశపరిచిన కోహ్లీపై చాలా విమర్శలే వచ్చాయి. కొందరైతే విరాట్ రిటైర్మెంట్ ఇవ్వొచ్చంటూ సలహాలు కూడా ఇచ్చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2024 | 06:45 PMLast Updated on: Dec 05, 2024 | 6:45 PM

King Kohli In The Hunt For Records Bradman Feat In The Making

సొంతగడ్డపై ఎవ్వరైనా కొడతారు… విదేశాల్లో పరుగుల వరద పారిస్తే ఆ కిక్కే వేరు.. ఈ మాటలు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతాయి. ఇటీవల బంగ్లాదేశ్, కివీస్ తో సిరీస్ లలో నిరాశపరిచిన కోహ్లీపై చాలా విమర్శలే వచ్చాయి. కొందరైతే విరాట్ రిటైర్మెంట్ ఇవ్వొచ్చంటూ సలహాలు కూడా ఇచ్చేశారు. కానీ వాళ్ళ మాటలను పట్టించుకుంటే కోహ్లీ ఎలా అవుతాడు… వారి విమర్శకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. అది కూడా పెర్త్ లాంటి పేస్ పిచ్ పై సెంచరీతో దుమ్మురేపాడు. ఈ శతకంతో మునుపటి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు తనకెంతో కలిసొచ్చిన అడిలైడ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై మరో శతకం సాధిస్తే వేరే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డ్‌ను సమం చేస్తాడు. ఆసీస్‌కు చెందిన డాన్ బ్రాడ్‌మన్ ఇంగ్లండ్ గడ్డపై 11 శతకాలు నమోదు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆసీస్ గడ్డపై 10 శతకాలతో కొనసాగుతున్నాడు. కోహ్లీ మరో రెండు సెంచరీలు నమోదు చేస్తే డాన్ బ్రాడ్‌మన్ రికార్డ్‌ను అధిగమిస్తాడు.

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఇప్పటికే ఓ శతకం బాది ఫామ్ లోకి వచ్చేశాడు. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్‌లో కూడా విరాట పర్వం చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అడిలైడ్ లో విరాట్ కు అద్భుతమైన రికార్డుంది. . ఇక్కడ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 15 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 957 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అడిలైడ్ వేదికగా ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ మూడు శతకాలు, హాఫ్ సెంచరీతో 509 పరుగులు చేశాడు. ఇక కోహ్లి మరో సెంచరీ సాధిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గానూ కోహ్లి రికార్డు సృష్టిస్తాడు. పెర్త్ టెస్టులో శతకంతో సచిన్ రికార్డును సమం చేశాడు. 65 ఇన్నింగ్స్‌ల్లో సచిన్, 44 ఇన్నింగ్స్‌లో కోహ్లి తొమ్మిది సెంచరీలు చేశారు. సచిన్, కోహ్లి తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్ , స్టీవ్ స్మిత్, మైకేల్ క్లార్క్ ఉన్నారు.

కాగా, రెండో టెస్టులో మరికొన్ని రికార్డులు కూడా విరాట్ ను ఊరిస్తున్నాయి. కోహ్లి మరో 23 పరుగులు సాధిస్తే.. డే నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా లారా రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు. అడిలైడ్‌లో లారా 611 పరుగులు చేయగా… కోహ్లి 509 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కొన్ని రికార్డులను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పింక్ బాల్ ఛాలెంజ్ కోసం ఇరు జట్లు రెడీ అయ్యాయి. అడిలైడ్ లో డే నైట్ మ్యాచ్ లో పరుగులు చేయడం అంత సులభం కాదు. దీంతో మరోసారి బౌలర్లే కీలకం కానున్నారు.