Kiran Kumar Reddy: కిరణ్ కుమార్ చేతికి ఏపీ బీజేపీ పగ్గాలు! కమలం పార్టీ రాత ఇప్పటికైనా మారుతుందా ?
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి. క్రికెట్, పాలిటిక్స్‌ను కలిపి మాట్లాడే మనిషి.
ఉద్యమ సమయంలో లాస్ట్ బాల్ వరకు పోరాడతాం అంటూ ఆయన చేసిన కామెంట్.. ఇప్పటికీ వినిపిస్తుంటుంది ఎక్కడో ఒకచోట ! ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా చేసిన వ్యక్తిని.. కావాలని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులు రావడమే దురదృష్టకరం. రాష్ట్రాన్ని విడగొట్టిందని కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కొత్తగా ఓ పార్టీ పెట్టి.. బొక్కాబోర్లా పడి.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరి.. అక్కడ పనిలేక బీజేపీలో చేరి.. ఇక్కడా పని లేకుండా ఉన్న నాయకుడు కిరణ్‌కుమార్ రెడ్డి. ఇలాంటి చర్చే జరుగుతోంది జనాల్లో ! కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
ఆయన కోసం ఇంత కష్టం ఎందుకు అనే అనుమానాలు వినిపించాయ్. పోనీ కష్టపడి తీసుకొచ్చి.. ఏవైనా బాధ్యతలు అప్పగించారా అంటే.. ఆరు నెలలు అవుతోంది కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఖాళీగా ఉండి ! ఏపీలో ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలన్న కసిమీద ఉన్న కమలం పార్టీ పెద్దలు.. ఇప్పుడో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అయ్యారనే ప్రచారం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఏపీ బీజేపీ బాధ్యతలు కిరణ్ కుమార్ రెడ్డికి అప్పజెప్పే అవకాశాలను.. బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోందని ! ఇది నిజమా అన్న సంగతి పక్కపెడితే.. నిజంగా ఇదే నిజం అయి ఏపీలో బీజేపీ తలరాత మారుతుందా అనే విశ్లేషణలు మొదలయ్యాయ్.
ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డికి.. ఆ పదవి దక్కడం కూడా అదృష్టమే ! స్పీకర్‌గా ఉన్న కిరణ్‌ను.. అప్పట్లో సీఎంను చేసింది కాంగ్రెస్. చిత్తూరు జిల్లా వాయల్పాడు అనే ప్రాంతానికి చెందిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా పట్టు ఉన్న ప్రాంతాలన్నీ.. పీలేరులోకి చేరిపోయాయ్. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నేత మాత్రమే ! ఇలాంటి వ్యక్తి.. పార్టీ తలరాత మారుస్తారని బీజేపీ ఆశలు పెట్టుకోవడం.. అత్యాశే అవుతుందనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో పుట్టిన ఏపీ నాయకుడు కిరణ్. ఏపీ నాయకుడే అని తెలంగాణలో పట్టించుకోరు.. హైదరాబాద్‌కు చెందిన నేత కదా అని ఏపీలో చర్చించుకోరు.
ఇలాంటి నేతకు పగ్గాలు అప్పగిస్తే ఏం జరుగుతుందో.. ఎవరికి వారే అంచనాల వేసుకోవాలనే చర్చ జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి సంగతి పక్కనపెడితే.. ఏపీ బీజేపీలో మూడు వర్గాలు ఉంటాయ్. ఒకటి టీడీపీ అనుకూల వర్గం.. రెండు వైసీపీ అనుకూల వర్గం.. మూడు సిసలైన బీజేపీ వర్గం.. ఎవరికి వారే అన్నట్లు.. ఎవరికి తోచిన కామెంట్లు వారు చేస్తుంటారు. నాన్‌లోకల్ అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ముద్ర తెచ్చుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి.. వాళ్లందరిని ఒక్కతాటి మీదకు తీసుకురాగలరా అంటే.. కష్టమే ! పైగా కాపులను కాదని.. రెడ్డి సామాజికవర్గానికి పార్టీ పగ్గాలు అందిస్తే.. ఏపీ బీజేపీలో భారీ లుకలుకలు మొదలయ్యే చాన్స్ ఉంటుంది. దీంతో ఇప్పటికిప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి పగ్గాలు అప్పగించినా.. పెద్దగా ఒరిగేది లేదు అన్నది మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.