కెెఎల్ రాహుల్ ఔట్ రెండో టెస్టుకు తుది జట్టు ఇదే
న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రారంభించింది. సొంతగడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా బెంగళూరులో అనూహ్యంగా పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 46 రన్స్ కే కుప్పకూలడం, తర్వాత రెండో ఇన్నింగ్స్ లో పోరాడినా ఫలితం మాత్రం మారలేదు.
న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రారంభించింది. సొంతగడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా బెంగళూరులో అనూహ్యంగా పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 46 రన్స్ కే కుప్పకూలడం, తర్వాత రెండో ఇన్నింగ్స్ లో పోరాడినా ఫలితం మాత్రం మారలేదు. అటు వర్షం కూడా భారత్ ఓటమిని అడ్డుకోలేకపోయింది. ఫలితంగా సిరీస్ లో 0-1తో వెనుకబడింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ గురువారం నుంచే పుణేలో జరగనుంది. సిరీస్ లో పుంజుకోవాలనుకుంటున్న భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలున్నాయి. మెడనొప్పితో తొలి టెస్టుకు దూరమైన శుభమన్ గిల్ జట్టులోకి తిరిగి రానున్నాడు. గిల్ లేకపోవడంతోనే సర్ఫరాజ్ ఖాన్ కు తుది జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఏకంగా 150 రన్స్ తో టీమిండియా మేనేజ్ మెంట్ కు తనను మళ్ళీ ఖచ్చితంగా ఎంపిక చేసేలా తప్పనిసరి పరిస్థితితిని కల్పించాడు.
రెండో ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ సెంచరీ కారణంగానే బెంగళూరులో భారత్ కు ఇన్నింగ్స్ ఓటమి తప్పింది. దీంతో రెండో టెస్టుకు సర్ఫరాజ్ ను పక్కన పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. తుది జట్టు నుంచి ఈ యువ ఆటగాడిని తప్పించే సాహసం రోహిత్ చేసే ఛాన్స్ లేదు. అదే సమయంలో గిల్ రీఎంట్రీతో ఇప్పుడు కెఎల్ రాహుల్ ను తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. గత మ్యాచ్ లో సర్ఫరాజ్, పంత్ ఔటైన తర్వాత రాహుల్ నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్ లో కనీసం క్రీజులో నిలవలేక 12 రన్స్ కే ఔటయ్యాడు. దీంతో ఈ సీనియర్ బ్యాటర్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు రాహుల్ ను తప్పించి గిల్ నే తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమైంది.
ఒకవేళ రిషబ్ పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధించకుంటే మాత్రం రాహుల్ తుది జట్టులో కొనసాగే ఛాన్సుంది. తొలి టెస్టులో కీపింగ్ చేస్తూ గాయపడిన పంత్ నొప్పి భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ కీపింగ్ కు రాలేదు. ఆసీస్ టూర్ నేపథ్యంలో రెండో టెస్ట్ సమయానికి పంత్ కోలుకోకుంటే రాహుల్ కీపింగ్ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ విభాగంలోనూ మార్పులు జరగనున్నాయి. పుణే పిచ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ముగ్గురు పేసర్లతో భారత్ బరిలోకి దిగే ఛాన్సుంది. బూమ్రా రాణిస్తున్నా సిరాజ్ మాత్రం ఇంకా అంచనాలను అందుకోవడం లేదు. రెండో టెస్టుకు బూమ్రా, సిరాజ్ లతో పాటు ఆకాశ్ దీప్ ను తుది జట్టులోకి తీసుకుంటారని భావిస్తున్నారు. దీంతో తొలి టెస్టులో మూడో స్పిన్నర్ గా ఆడిన కుల్దీప్ యాదవ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు.