RCBలోకి కెఎల్ రాహుల్ ? హింట్ ఇచ్చిన స్టార్ క్రికెటర్

ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి ఎవరికి భారీ ధర పలకబోతోందన్న అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ముగ్గురు కెప్టెన్లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కోసం గట్టి డిమాండ్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 13, 2024 | 09:26 PMLast Updated on: Nov 13, 2024 | 9:26 PM

Kl Rahul To Rcb The Star Cricketer Who Gave The Hint

ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి ఎవరికి భారీ ధర పలకబోతోందన్న అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ముగ్గురు కెప్టెన్లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కోసం గట్టి డిమాండ్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ముగ్గురిలో పంత్ కు ఎక్కువ బిడ్డింగ్ వస్తుందని కొందరు అంచనా వేస్తుండగా.. ఎవరిని ఏ టీమ్ కొంటుందనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కెఎల్ రాహుల్ తాను ఏ టీమ్ కు వెళ్ళాలనుకుంటున్నాడో హింట్ ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆర్సీబీకి వెళ్ళాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు జవాబిచ్చాడు. అవకాశం వస్తే ఎందుకు వెళ్ళానంటూ వ్యాఖ్యానించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోమ్ టీమ్ గా చెప్పాడు.

2013లో రాహుల్ ఆర్సీబీ జట్టుతోనే ఐపీఎల్​ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2014, 2015 సీజన్లలో సన్​రైజర్స్ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహించాడు. మళ్లీ 2016లో ఆర్సీబీకి తిరిగి వచ్చిన రాహుల్ గాయం కారణంగా 2017 సీజన్ ​లో ఆడలేదు. 2018 లో ఆర్సీబీ వదులుకోవడంతో రాహుల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు మారాడు. నాలుగేళ్ళ పాటు పంజాబ్ జట్టుకు ఆడిన కెఎల్ రాహుల్ ను కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ 2022లో తమ జట్టుకు సారథిగా ఎంపిక చేసుకుంది. అప్పటి నుంచి టీమ్ ను చక్కగా లీడ్ చేసిన రాహుల్ ఆధ్వర్యంలోనే లక్నో రెండుసార్లు ప్లే ఆఫ్స్ కు చేరింది. అయితే 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్​తో మ్యాచ్ ఓడిన తర్వాత లఖ్​నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ రాహుల్​పై అందరి ముందే అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో అప్పటి నుంచి ఆ ఫ్రాంచైజీ ఓనర్లతో అతనికి చెడింది. ఇటీవల రిటెన్షన్ లో లక్నో రాహుల్ ను వదలేయడంతో వేలంలోకి వచ్చాడు.

ఇదిలా ఉంటే స్టార్ స్పోర్ట్స్ ఇంటర్యూలో కెఎల్ రాహుల్ ఆర్సీబీకి ఆడిన సందర్భాలను గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా 2016 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ చేతిలో ఓడిపోవడం చాలా బాధించిందని చెప్పాడు. గత ఐదారేళ్ళలో తాను, విరాట్ కోహ్లీ చాలా సార్లు ఆ ఫైనల్ గురించి మాట్లాడుకున్నట్టు గుర్తు చేసుకున్నాడు. తామిద్దరిలో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను ముగించాల్సిందని అభిప్రాయపడ్డాడు.ఆ మ్యాచ్ గెలిచి టైటిల్ అందుకొని ఉంటే ఓ మంచి క్షణంగా నిలిచిపోయేదంటూ గుర్తు చేసుకున్నాడు. ఒకవేళ వేలంలో ఆర్సీబీ తనను తీసుకుంటే జట్టులో ఎలాంటి పాత్ర ఇచ్చినా.. బాధ్యతకైనా సిద్దంగా ఉన్నట్టు వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ ఫ్రాంచైజీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.