గత ఏడాది భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి నిరాశే మిగిల్చింది. ఒక్క టీ ట్వంటీ ప్రపంచకప్ తప్పిస్తే మిగిలిన సిరీస్ లలో రన్ మెషీన్ కు అలుపొచ్చింది... ఒక్క సిరీస్ లోనూ స్థాయికి తగినట్టు ఆడలేకపోయాడు. పరుగుల యంత్రంగా పిలుచుకునే విరాట్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు రాలేదు. ఒకటిరెండు వచ్చినా తర్వాత మళ్ళీ వైఫల్యాల బాటలోనే నిలిచాడు. ఫలితంగా 2024 కోహ్లీ కెరీర్ లో అత్యంత పేలవంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ రిటైర్మెంట్ కు దగ్గర పడ్డాడంటూ విమర్శలు వినిపించాయి. కానీ విరాట్ కు ఉన్న ఫిట్ నెస్ దృష్ట్యా మరో రెండు మూడేళ్ళు ఈజీగా అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడనేది కొందరు మాజీల మాట... టీ ట్వంటీలకు ఎలాగూ గుడ్ బై చెప్పేసిన కోహ్లీ ఇక రెడ్ బాల్ క్రికెట్ పైనే మేజర్ ఫోకస్ పెట్టనున్నాడు. దీని కోసం దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. గంభీర్ చెప్పినట్టు రంజీలు మాత్రం కాదు.. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో ఆడేందుకు కోహ్లీ రెడీ అవుతున్నాడు. 2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. దీనిలో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై 5 టెస్టులు ఆడనుంది. ఈ కఠిన సవాలుకు ముందు కోహ్లీ ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి హెడ్డింగ్లీలోని లీడ్స్‌లో ప్రారంభమవుతుంది. ఐపీఎల్ తర్వాత కోహ్లీ కౌంటీల్లో ఆడతాడనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకోకపోతే కోహ్లీకి కౌంటీల్లో ఎక్కువ మ్యాచ్ లు ఆడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే లండన్ లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్న విరాట్ కు ఫ్యామిలీకి దూరంగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఇంగ్లాండ్ తో సిరీస్ కు అక్కడి పిచ్ లకు అలవాటు పడేందుకు ఇదే మంచి ప్లాన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా కోహ్లీ తన మునుపటి ఫామ్ అందుకునేందుకు కూడా చక్కని అవకాశంగా చెబుతున్నారు. ఎందుకంటే కౌంటీ క్రికెట్ లో దేశ, విదేశీ స్టార్ ప్లేయర్స్ చాలా మంది ఆడుతూనే ఉంటారు. ఆ బౌలింగ్ ను ఎదుర్కొని పరుగులు సాధిస్తే విరాట్ మళ్ళీ తన రికార్డుల వేట మొదలుపెట్టొచ్చు. కాగా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా జాతీయ జట్టులో కొనసాగాలంటే ఫామ్ కోల్పోయిన వాళ్ళు దేశవాళీ క్రికెట్ ఆడాలని హెడ్ కోచ్ గంభీర్ ఇప్పటికే రూల్ పెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రూల్స్ సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ కు వర్తిస్తాయని కామంట్లు వినిపిస్తున్నాయి. మాజీ ఆటగాళ్ళు గవాస్కర్, రవిశాస్త్రి కూడా కోహ్లీ, రోహిత్ దేశవాళీ క్రికెట్ ఆడితే మళ్ళీ ఫామ్ అందుకుంటారని సూచించారు. ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ నిరాశపరిచాడు. 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో 12 ఏళ్ళ తర్వాత టాప్ 25 లో చోటు కోల్పోయాడు[embed]https://www.youtube.com/watch?v=mlN3MVgYAA8[/embed]