కెరీర్ లోనే వరస్ట్, దిగజారిన కోహ్లీ,రోహిత్ ర్యాంకింగ్స్
పేలవమైన ఫామ్ తో సతమతమవుతున్న భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దిగజారారు. తాజాగా విడుదలైన జాబితాలో వీరిద్దరూ తమ కరీర్ లోనే అత్యంత చెత్త స్థానాల్లో నిలిచారు.
పేలవమైన ఫామ్ తో సతమతమవుతున్న భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దిగజారారు. తాజాగా విడుదలైన జాబితాలో వీరిద్దరూ తమ కరీర్ లోనే అత్యంత చెత్త స్థానాల్లో నిలిచారు. రోహిత్ శర్మ అయితే ఏకంగా టాప్ 40లో కూడా చోటు నిలుపుకోలేకపోయాడు. తాజా జాబితాలో హిట్ మ్యాన్ 42వ స్థానానికి పడిపోయాడు. గత ఏడాది రోహిత్ కెరీర్ లోనే అత్యంత పేలవంగా నిలిచింది. ఏ ఫార్మాట్ లోనూ హిట్ మ్యాన్ మెరుపులు లేవు. ఇక టెస్టుల్లో చెప్పుకునేందుకు కూడా ఏమీ లేదు. స్వదేశంలో బంగ్లాదేశ్ తో సిరీస్ ముందు వరకూ ఆరో స్థానంలో ఉన్న రోహిత్ క్రమంగా దిగజారుతూ వచ్చాడు. న్యూజిలాండ్ తో సిరీస్ ముగిసేసరికి 27వ ర్యాంకులోనూ, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసేటప్పటకి 42వ స్థానంలోనూ నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హిట్ మ్యాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నాలుగు టెస్టుల్లో 3 టెస్టుల్లో 31 పరుగులకే పరిమితమయ్యాడు. అతని కంటే బుమ్రా, ఆకాశ్ దీప్ ఎక్కువ రన్స్ చేశారు.
మరోవైపు విరాట్ కోహ్లీది కూడా దాదాపు ఇదే పరిస్థితి…తాజా ర్యాంకింగ్స్ లో మూడుస్థానాలు దిగజారిన కోహ్లీ 27వ స్థానానికి పరిమితమయ్యాడు. న్యూజిలాండ్ తో సొంతగడ్డపై జరిగిన సిరీస్ లో అంతంతమాత్రంగానే రాణించిన కోహ్లీ.. ఆసీస్ పర్యటనలో ఒక్క సెంచరీ మాత్రమే కొట్టాడు. మిగతా అన్ని మ్యాచ్ లలో ఘోరంగా విఫలమయ్యాడు. కోహ్లీ టాప్ 20లో చోటు కోల్పోవడం దశాబ్ద కాలం తర్వాత ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే టాప్ 10లో కేవలం ఇద్దరు భారత ప్లేయర్సే చోటు దక్కించుకున్నారు. ఆసీస్ టూర్ లో పర్వాలేదనిపించిన యశస్వి జైశ్వాల్ నాలుగో ర్యాంకులోనూ నిలిస్తే… సిడ్నీ టెస్టులో రాణించిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ తొమ్మిదో స్థానంలోకి చేరుకున్నాడు. వైఫల్యాల బాటలో ఉన్న శుభమన్ గిల్ 23వ స్థానంలోనూ, రవీంద్ర జడేజా 51వ ర్యాంకులోనూ, కెఎల్ రాహుల్ 52వ ర్యాంకులోనూ నిలిచారు.
బౌలింగ్ విభాగంలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 32 వికెట్లతో అదరగొట్టాడు. అలాగే భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో నిలిచాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 2వ స్థానంలో ఉండగా.. హ్యాజిల్ వుడ్ స్థానంలో జట్టులోకి వచ్చి అదరగొట్టిన ఆసీస్ పేసర్ స్కాట్ బొలాండ్ ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకులో నిలిచాడు.