కోహ్లీ దూకుడు, యువ క్రికెటర్ తో గొడవ
బాక్సింగ్ డే టెస్ట్ రసవత్తరంగా ఆరంభమయింది. తొలి రోజు ఆతిథ్య జట్టుదే పై చేయిగా నిలిచింది. 19 ఏళ్ల ఆసీస్ యువ ఓపెనర్ శాం కొంటాస్ అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. బుమ్రతో సహా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు.
బాక్సింగ్ డే టెస్ట్ రసవత్తరంగా ఆరంభమయింది. తొలి రోజు ఆతిథ్య జట్టుదే పై చేయిగా నిలిచింది. 19 ఏళ్ల ఆసీస్ యువ ఓపెనర్ శాం కొంటాస్ అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. బుమ్రతో సహా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఈ యువ క్రికెటర్ తో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కయ్యానికి దిగాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. దాంతో ఈ 19 ఏళ్ల కుర్రాడినే కవ్వించే ప్రయత్నం చేశాడు. తనకు ఎదురుగా నడిచిన సామ్ కోన్‌స్టాస్ భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు. అనంతరం అతనితో వాగ్వాదానికి దిగాడు. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దర్ని వారించారు. ఈ ఘటన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం చోటు చేసుకుంది. ఈ ఓవర్ పూర్తయిన అనంతరం సామ్ కోన్‌స్టాస్ మరో ఎండ్ వైపు నడుస్తుండగా.. కోహ్లీ డ్యాష్ ఇచ్చాడు.
కోహ్లీ కవ్వింపులకు ఏమాత్రం సహనం కోల్పోని సామ్ కోన్‌స్టాస్ బ్యాట్‌తోనే బదులిచ్చాడు. బుమ్రా వేసిన ఆ మరుసటి 11వ ఓవర్‌లో కోన్‌స్టాస్ 18 పరుగులు పిండుకున్నాడు. వీడియో చూస్తుంటే కోహ్లీ కావాలనే యువ ఆటగాడి భుజాన్ని తాకాడని అనిపిస్తోంది. యువ ఆటగాడి ఏకాగ్రతను చెడగొట్టేందుకే కోహ్లీ ఈ విధంగా చేసి ఉంటాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ తీరును తప్పుబడుతున్నారు. వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అయిన కోహ్లీ.. అరంగేట్ర ప్లేయర్ ఆటను అభినందించాల్సింది పోయి.. కవ్వింపులకు పాల్పడటం సరికాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు కోహ్లీ అభిమానులు మాత్రం అతనికి అండగా నిలుస్తున్నారు. 19 ఏళ్ల కుర్రాడైన ప్రత్యర్థి ఆటగాడేనని, జట్టు విజయం కోసం కొన్ని సార్లు మైండ్ గేమ్ కూడా ఆడాల్సి ఉంటుందని, కోహ్లీ అదే చేశాడని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.