కోహ్లీ బ్యాడ్ టైమ్ టాప్-20 నుంచి ఔట్
పరుగుల యంత్రంగా , రికార్డుల రారాజుగా అభిమానులు పిలుచుకునే విరాట్ కోహ్లీకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. అది కూడా మామూలు బ్యాడ్ టైమ్ కాదు... కెరీర్ లోనే అత్యంత పేలవమైన ఫామ్ తో విరాట్ ఇబ్బందిపడుతున్నాడు
పరుగుల యంత్రంగా , రికార్డుల రారాజుగా అభిమానులు పిలుచుకునే విరాట్ కోహ్లీకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. అది కూడా మామూలు బ్యాడ్ టైమ్ కాదు… కెరీర్ లోనే అత్యంత పేలవమైన ఫామ్ తో విరాట్ ఇబ్బందిపడుతున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన కోహ్లీ ఇప్పుడు 10 రన్స్ చేసేందుకు కూడా శ్రమిస్తున్నాడు. అన్నింటికీ మించి ఒకప్పుడు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను శాసించిన విరాట్ ఇప్పుడు టాప్ 20లో కూడా లేడు. టెస్టుల్లో నెంబర్ వన్ గా ఉండి.. ఆ తర్వాత కూడా ఏళ్లకి ఏళ్లుగా టాప్ టెన్ లో చోటు నిలుపుకుంటూ వచ్చిన కోహ్లీ ఇలా టాప్-20లో చోటు దక్కించుకోలేకపోవడం టీమిండియా అభిమానుల్ని బాధపెడుతోంది.
న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 93 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 22వ స్థానానికి దిగజారిపోయాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్-20లో లేకపోవడం 2014 తర్వాత ఇదే తొలిసారి. కోహ్లీతో పాటు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఫెయిలైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండు స్థానాలు కోల్పోయి బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 26వ స్థానానికి పడిపోయాడు. టింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఉన్నారు. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు. కివీస్ పై రాణించిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. శుభమన్ గిల్ 16వ స్థానంలో ఉన్నాడు.
మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా రెండు స్థానాలు మెరుగై ఆరో స్థానంలో నిలిచాడు. అశ్విన్ ఐదో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో జడేజా 10 వికెట్లు పడగొట్టాడు. టెస్టు బౌలర్ల జాబితాలో వాషింగ్టన్ సుందర్ ఏడు స్థానాలు ఎగబాకి 46వ స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 12 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంక్‌కి చేరుకున్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్ తో కోహ్లీ ఫామ్ లోకి వస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆసీస్ గడ్డపై విరాట్ కు తిరుగులేని రికార్డుంది. అలాగే రోహిత్ శర్మతో పాటు మరికొందరు సీనియర్ ప్లేయర్స్ కు కూడా ఈ పర్యటన అత్యంత కీలకం కానుంది. అటు కోచ్ గౌతమ్ గంభీర్ కు సైతం ఆసీస్ టూర్ అగ్నిపరీక్షగా మారింది.