నా జేబులో ఏం లేదురా, ఆసీస్ ఫ్యాన్స్ కు కోహ్లీ ఝలక్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైనప్పటి నుంచి ఆసీస్ మీడియా, ఆసీస్ అభిమానులతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు. కంగారూ గడ్డపై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉండడమే దీనికి కారణం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైనప్పటి నుంచి ఆసీస్ మీడియా, ఆసీస్ అభిమానులతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు. కంగారూ గడ్డపై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉండడమే దీనికి కారణం. కోహ్లీ మళ్ళీ చెలరేగితే ఈ సారి కూడా బోర్డర్ గవాల్రప్ ట్రోఫీ చేజారిపోతుందన్న భయంతోనే కోహ్లీని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో కోహ్లీ కూడా ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేదు. ఒక సెంచరీ మాత్రమే చేసిన విరాట్ పూర్తిగా నిరాశపరిచాడు. అయితే గ్రౌండ్ లో ఉన్నంతసేపు ఆసీస్ ఆటగాళ్ళకు, అక్కడి ఫ్యాన్స్ కు మాత్రం విరాట్ తనదైన మార్క్ స్లెడ్జింగ్ చూపించాడు.
తాజాగా సిడ్నీ టెస్టులో బూమ్రా తప్పుకోవడంతో సారథ్య బాధ్యతలు తీసుకున్న కోహ్లీ తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో
తనదైన శైలిలో ఆస్ట్రేలియా అభిమానులకు కౌంటర్ ఇచ్చాడు. మూడో రోజు ఆటలో భాగంగా సరదాగా ప్రేక్షకులను అలరించాడు. తన రెండు జేబులను చూపిస్తూ.. నా దగ్గర ఏమీ లేదు.. నా జేబు ఖాళీ అన్నట్టు ప్రేక్షకుల వైపు చూశాడు. కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానులను ఎగతాళి చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మార్చి 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా బ్యాటర్ బాన్‌క్రాఫ్ట్ ఒక సాండ్‌పేపర్ ముక్కను జేబులో పెట్టుకురాగా.. ఆ పేపర్ సాయంతో మైదానంలో బంతి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారంలో అతనికి అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మద్దతు పలికారు. ఈ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కెమెరాకు చిక్కడంతో వీరి బాగోతం బయటపడింది. ఆపై మ్యాచ్ ముగిశాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాన్‌క్రాఫ్ట్త తన తప్పును అంగీకరించాడు.
దీనిపై విచారణ జరిపిన ఐసీసీ వారిపై కఠిన చర్యలే తీసుకుంది. కాగా అప్పుడు బాన్‌క్రాఫ్ట్ చేసిన పనిని ఇప్పుడు కోహ్లీ ఇమిటేట్ చేస్తూ ఆసీస్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే సిడ్నీ టెస్టులో భారత్ ఘోరపరాజయం పాలైంది. 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కైవసం చేసుకుంది.