Raja Gopal Reddy: రాజగోపాల్ రాజీనామాకు.. కవిత వ్యవహారమే కారణమా ?
ఎన్నికల ముందు బీజేపీకి కోలుకోలేని దెబ్బగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలు మారినా తన లక్ష్యం ఒకటేనని.,. ఆ లక్ష్యం కోసమే పార్టీ మారుతున్నానని కోమటిరెడ్డి సెంటిమెంట్ డైలాగులు వదులుతున్నా.. అసలు కారణం వేరు ఉందనే చర్చ జరుగుతోంది.

Komati Reddy Rajagopal Reddy resigned from BJP because of MLC Kavitha's poem
అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. తెలంగాణలో ఆచీతూచీ అడుగులు వేస్తోంది. సీనియర్ల మధ్య విభేదాలు పరిష్కరిస్తూ.. వాళ్లంతా కలిసిపోయేలా, కలిసి పోరాడేలా వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హ్యాండ్ ఇవ్వడం.. ఎన్నికల ముందు బీజేపీకి కోలుకోలేని దెబ్బగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలు మారినా తన లక్ష్యం ఒకటేనని.,. ఆ లక్ష్యం కోసమే పార్టీ మారుతున్నానని కోమటిరెడ్డి సెంటిమెంట్ డైలాగులు వదులుతున్నా.. అసలు కారణం వేరు ఉందనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత వ్యవహారమే.. రాజగోపాల్ రాజీనామాకు కారణం అయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. నిజానికి బీజేపీలో చేరిన కొత్తలో.. రాజగోపాల్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మునుగోడులో ఓడిపోయినా.. పెద్దగా నిరాశ పడినట్లు కనిపించలేదు. అలాంటిది సడెన్‌గా ఆయన వ్యవహారశైలిలో మార్పు కనిపించింది.
కొద్దిరోజులుగా బీజేపీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి కవిత వ్యవహారమే కారణంగా కనిపిస్తోంది. నిజానికి కేసీఆర్ ఫ్యామిలీ మీద రాజగోపాల్ చాలా కోపంగా ఉన్నారు. ఆ కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపించే వరకు.. నిద్రపోయేది లేదని ఒక ఇంటర్వ్యూలోనే చెప్పుకొచ్చారు. అలాంటిది కవిత విషయంలో జరిగిన పరిణామాలతో రాజగోపాల్ హర్ట్ అయ్యారా.. అందుకే రాజీనామా చేశారా అనే ప్రచారం నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం జరిగినా.. అరెస్ట్ జరగలేదు. అదే సమయంలో రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్టు చేయకపోతే.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు. ఇది జరిగిన కొద్దిరోజులకే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించారు. ఆ సమయంలో రాజగోపాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భావోద్వేగానికి లోనయ్యారు.
అప్పటినుంచి రాజగోపాల్ సహా.. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. వాళ్లంతా కలిసి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకున్నారు కూడా ! ఐతే ఎమ్మెల్సీ కవిత వ్యవహారం నాటి నుంచే.. పార్టీ మారాలని ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఐతే కేసీఆర్ కుటుంబం మీద గెలవాలన్న తన పట్టుదల.. బీజేపీలో ఉంటే నెరవేరే లేదని రాజగోపాల్ ఫిక్స్ అయ్యారా.. అందుకే కాంగ్రెస్‌లో చేరారా అనే చర్చ జరుగుతోంది. ఐతే రేవంత్ రెడ్డితో పొసగక పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు హస్తం పార్టీలో ఎలా అడ్జస్ట్ అవుతారో మరి !