KTR: కాంగ్రెస్‌కు అసలు సినిమా ముందుంది.. వాళ్లవి 420 హామీలు: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నాం. గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాలతో బీఆర్ఎస్‌ను, గత కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలు పెట్టింది. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు మన మీద ఆకారణంగా నిందలు వేస్తె ఊరుకోము.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2024 | 02:18 PMLast Updated on: Jan 10, 2024 | 2:18 PM

Ktr Criticises Congress Government In Telangana

KTR: ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, ఆసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బుధవారం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. “విధ్వంసమైన తెలంగాణను పది సంవత్సరాల పాటు కేసీఆర్ వికాసం వైపు మళ్లించారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారు. పరిపాలనపైన పూర్తి దృష్టి కేంద్రీకరించి, పార్టీకి తక్కువ సమయాన్ని కేటాయించాం.

YSRCP: శ్రీకాకుళం వైసీపీ లీడర్ల కష్టాలు.. మామూలుగా లేవుగా !

ఇకపై.. ఇలాంటి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసేదిశగా ముందుకు పోతాం. ప్రజలు మనతో ఉన్నారనే ధీమాలో ఎన్నికల దాకా ఉన్నాం. ఓరుగల్లు అంటే ఉద్యమాల వీరగడ్డ. వరంగల్ జిల్లాలోనూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారు. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల. 2014 ,2019లలో వరంగల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలిచింది. ఈ సారి కూడా వరంగల్‌లో గులాబీ జెండా ఎగరాలి. ఇది ఎనిమిదో పార్లమెంట్ స్థానానికి సంబంధించిన సన్నాహక సమావేశం. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయి. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటాం. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి.. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దాం. కార్యకర్తల్లో ఉత్సాహం యధావిధిగా ఉంది. ఇదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేయాలి. మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం మనం గుర్తుంచుకొని ముందుకు పోదాం. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు. 420 హామీలు. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నాం. గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాలతో బీఆర్ఎస్‌ను, గత కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలు పెట్టింది. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు మన మీద ఆకారణంగా నిందలు వేస్తె ఊరుకోము.

అందుకే అసెంబ్లీలో కాంగ్రెస్‌ను గట్టిగా నిలదీశాం. కేసీఆర్ కరెంటు పరిస్థితి బాగు చేశారని చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తాం. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదు. ఆసలు సినిమా ముందుంది. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు. చెమట ధార పోశారు. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటిపైన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని భట్టి అసెంబ్లీ వేదిగ్గా అబద్ధమాడారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వాళ్ళ 420 హామీలతోనే ఎండగట్టాలి. ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కసుతో రద్దు చేస్తుంది. వాటిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటుంది. పేద గొంతుకలకు మనం అండగా ఉండాలి. సీఎం జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా..? నెలరోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలను నష్టపరిచాయి. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.