కుల్దీప్ కు వీసా లేదు తనుష్, ఎంపికపై రోహిత్ జోక్స్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అందరికీ షాకిచ్చింది. గబ్బా టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతని స్థానంలో ఇప్పుడు మరో ఆల్ రౌండర్ తనుష్ కొటియాన్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అందరికీ షాకిచ్చింది. గబ్బా టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతని స్థానంలో ఇప్పుడు మరో ఆల్ రౌండర్ తనుష్ కొటియాన్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ముంబైకి చెందిన తనుష్ దేశవాళీ క్రికెట్ లో అదరగొడుతుండడంతో జాతీయ జట్టు పిలుపు దక్కింది. అయితే నాలుగో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనుష్ ఎంపికపై ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. కుల్దీప్ ను కాదని అతన్ని ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నకు రోహిత్ ఫన్నీగా జవాబిచ్చాడు. కుల్దీప్ కు వీసా దొరకలేదని, అందుకే తనూష్ కోటియన్ ను ఎంపిక చేశామంటూ చెప్పి నవ్వులు పూయించాడు. ఎవరో ఒకరు చాలా త్వరగా ఇక్కడికి రావాలని భావించామనీ, అప్పుడు తనూష్ రెడీగా ఉన్నాడంటూ జోక్ చేశాడు.
తర్వాత అసలు కారణం వెల్లడించిన రోహిత్ తనుష్ గత రెండేళ్లుగా బాగా ఆడుతున్నాడని గుర్తు చేశాడు. ఒకవేళ సిడ్నీ లేదా మెల్‌బోర్న్ లలో ఇద్దరు స్పిన్నర్లను ఆడిస్తే ఓ బ్యాకప్ కావాలని అతన్ని రప్పించామని రోహిత్ చెప్పుకొచ్చాడు. సీనియర్ స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్ ఉండగా.. తనూష్ ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కూడా రోహిత్ సమాధానమిచ్చాడు. కుల్దీప్ కు హెర్నియా సర్జరీ జరిగిందనీ, అతడు ఇంకా 100 శాతం ఫిట్ గా లేడని క్లారిటీ ఇచ్చాడు. అదే సమయంలో అక్షర్ ఈ మధ్యే తండ్రయ్యాడనీ, అతను కూడా సెలక్షన్ కు అందుబాటులో లేడన్నాడు. అందుకే తనూష్ తమకు బెస్ట్ ఆప్షన్ గా అనిపించాడని చెప్పుకొచ్చాడు. ఇటీవల ముంబై రంజీ ట్రోఫీ గెలవడానికి అతడు కూడా ఒక కారణమంటూ ప్రశంసించాడు.
తనూష్ ఆస్ట్రేలియా ఎతో ఈ మధ్యే జరిగిన రెండు అనధికారిక టెస్టుల కోసం ఇండియా ఎలోనూ అతడు ఉన్నాడు. రెండో టెస్టులో ఆడి ఒక వికెట్ తీయడంతోపాటు 44 రన్స్ చేశాడు. అతడు ఇప్పటి వరకూ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 1525 రన్స్ చేశాడు. ఇక 25.7 సగటుతో 101 వికెట్లు కూడా తీశాడు. కొన్నేళ్లుగా ముంబై తుది జట్టులో క్రమం తప్పకుండా ఉంటున్నాడు. 2023-24లో రంజీ ట్రోఫీని ముంబై గెలవగా.. తనూష్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. ఆ సీజన్ లో అతడు 502 రన్స్ చేయడంతోపాటు 29 వికెట్లు కూడా తీశాడు.