Chandrayaan3: చంద్రుడి పై రోవర్, ల్యాండర్ పునరుద్దరించడం కష్టమేనా.. దీనికి కారణం ఏంటి..?
చంద్రుడిపైకి పంపిన ల్యాండర్, రోవర్ ని ఈనెల 4వ తేదీ నిద్రాణ స్థితిలోకి పంపింది ఇస్రో. తాజాగా అక్కడ సూర్యకిరణాలు ప్రసరించడంతో తిరిగి యాక్టివ్ చేయాలని తీవ్రంగా శ్రమిస్తోంది.
చంద్రయాన్3 పేరుతో అంతరిక్షంలోకి విక్రమ్ ల్యాండర్ ను పంపి అది సాధించిన విజయాలు మనకు తెలిసిందే. అయితే మన లెక్క ప్రకారం చంద్రుడిపై ఒక రోజు అంటే 14 రోజులు వెలుగు, మరో 14 రోజులు చీకటి ఉంటుంది. ఉదయం సౌర శక్తితో ల్యాండర్, రోవర్లు పనిచేసి అక్కడి సమాచారాన్ని మనకు అందిస్తాయి. గతంలో 14 రోజులు అంటే చంద్రడి పగటి కాలం ముగియడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపించారు శాస్త్రవేత్తలు.
తాజాగా శివశక్తి పాయింట్ వద్ద సూర్య కిరణాలు పడటంతో ఈ రెండింటినీ యాక్టివ్ చేసే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. తద్వారా తిరిగి అక్కడి సమాచారాన్ని పునరుద్దరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీ రోవర్ లోని ఏపీఎక్స్ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్ సిస్టమ్స్ ను నిలిపివేశారు. దీని సహాయంతోనే అక్కడి సమాచారం ల్యాండర్ ద్వారా భూమికి చేరుతుంది.
2019లో చైనా పంపిన ల్యాండర్ చాంగ్-4, రోవర్ యూటు-2 లు శుక్రవారం యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి కారణం చైనా ప్రయోగం చేసిన ప్రాంతం వేరు అంటున్నారు నిపుణులు. మన దేశం ప్రయోగం చేసిన ప్రదేశం దక్షిణ ధృవం. ఇక్కడ పరిస్థితులకు.. చైనా ల్యాండర్ ఉన్న పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి అని అంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రుడిపై అన్ని ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ ధృవంపై కనిష్ట ఉష్ణోగ్రత -250 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే మన రోవర్, ల్యాండర్ మేల్కొల్పడంలో కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. దీనిని తిరిగి యాక్టివ్ చేయాలంటే పవర్ ఫుల్ బ్యాటరీ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యం సరిపోదు కనుక రోవర్, ల్యాండర్ లను పునరుద్దరించడం కష్టమే అని అభిప్రాయ పడుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
T.V.SRIKAR