BRS TO TRS : మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చేద్దాం ! BRSతో సెంటిమెంట్ గోవిందా !!

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారింది. తెలంగాణ వచ్చాక పదేళ్ళు పాలించింది. ఇక తమకు తిరుగులేదు అనుకున్న ఆ పార్టీ చీఫ్ కేసీఆర్.. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఉన్నట్టుండి మోడీ మీద అంతెత్తున ఎగిరిపడుతూ.. బీఆర్ఎస్ పార్టీగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి.. ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్నారు. కానీ పాపం కథ అడ్డం తిరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2024 | 10:36 AMLast Updated on: Jan 11, 2024 | 10:36 AM

Lets Change It To Trs Again Sentiment Govinda With Brs

 

 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారింది. తెలంగాణ వచ్చాక పదేళ్ళు పాలించింది. ఇక తమకు తిరుగులేదు అనుకున్న ఆ పార్టీ చీఫ్ కేసీఆర్.. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఉన్నట్టుండి మోడీ మీద అంతెత్తున ఎగిరిపడుతూ.. బీఆర్ఎస్ పార్టీగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి.. ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్నారు. కానీ పాపం కథ అడ్డం తిరిగింది. తెలంగాణలోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వల్లే అధికారం పోయిందని చాలామంది పార్టీ సీనియర్లు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సరే.. మళ్ళా తెలంగాణ రాష్ట్రసమితిగా మార్చేద్దాం అంటూ సమీక్షా సమావేశాల్లో ప్రపోజ్ చేస్తున్నారు. వరంగల్ మీటింగ్ లో ఇదే అంశాన్ని లేవనెత్తారు మాజీ మంత్రి కడియం శ్రీహరి.

TRS ను BRS గా మార్చినా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ మాత్రం ఆ పార్టీ వదులుకోలేదు. పార్టీ పేరు మార్చుకున్నాక.. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో పార్టీని విస్తరించాలని కేసీఆర్ కలలు గన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వసొమ్ముతో భారీ కాన్వాయ్ లు కట్టుకొని మహారాష్ట్రకు వెళ్ళొచ్చారు. కానీ అసలు పార్టీ ఉనికి ఎక్కడ చాటుకోవాలో.. ఆ తెలంగాణలోనే BRS దెబ్బతింది. పదేళ్ళు పాలించినా జనం మూడోసారి ఆ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. అడుగడుగునా అహంకారం, జనం అంటే నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు.. తెలంగాణను అప్పులపాలు చేయడం.. ఇవన్నీ బీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేశాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. లోక్ సభ ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ మీదనే పోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పేరు మార్చాకే తమకు కష్టాలు వచ్చాయంటున్నారు. పార్టీలో ఎప్పుడైతే తెలంగాణ పేరు తీసేశారో.. అప్పటి నుంచే జనంలో గుర్తింపు కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. అందుకే మళ్ళీ జనంలో సెంటిమెంట్ రావాలంటే.. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాల్సిందే అంటున్నారు. ఇదే విషయాన్ని వరంగల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు ఉంచారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. ఇది తన అభిప్రాయం కాదనీ.. పార్టీ కార్యకర్తలు అందరిదీ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు TRS ను సొంత పార్టీగా భావించారు.. పార్టీ పేరులో తెలంగాణ తీసెయ్యడంతో సెంటిమెంట్ ని ప్రభావితం చేసిందన్నారు కడియం. TRSతోనే ప్రజలకు అనుబంధం ఉండేదనీ.. బీఆర్ఎస్ గా మారాక.. ఆ సెంటిమెంట్, ఆ అటాచ్ మెంట్ పోయాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని.. బీఆర్ఎస్ ను తిరిగి TRS గా మార్చే విషయం ఆలోచించాలని కేటీఆర్ ను కోరారు కడియం.

పార్టీ పేరులో తెలంగాణ తొలగించడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1 నుంచి 2 శాతం ఓట్లు కోల్పోయామని బీఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారట. పార్టీకి కలిసి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్ ను దూరం చేయడం కరెక్ట్ కాదు.. మార్చేయండి అంటూ విజ్ఞప్తి చేశారు కడియం శ్రీహరి. అయితే ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన సూచన కూడా కడియం శ్రీహరి నుంచి వచ్చింది. తెలంగాణలో TRS పార్టీని ఉంచండి.. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పెట్టండి అంటున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కడియంతో పాటు కొందరు నేతలు మీటింగ్ లో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ మీద రాజకీయం చేయాలని చూస్తున్న గులాబీ బాస్, ఆయన కొడుకు.. మరి లీడర్లు సూచించనట్టు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తారా.. లేదంటే.. ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్.. తెలంగాణలో టీఆర్ఎస్ ని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి. కేసీఆర్ దీనిపై ఏ డెసిషన్ తీసుకుంటారని గులాబీ లీడర్లు వెయిట్ చేస్తున్నారు.