భారత్ కథ ముగిస్తాం ఆసీస్ మాజీ కెప్టెన్ వార్నింగ్
భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ వర్గాల్లో ఎనలేని ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆసీస్ ఆధిపత్యానికి వారి సొంతగడ్డపైనే చెక్ పెట్టిన ఘనత మన సొంతం.. అందుకే కంగారూలు భారత్ తో సిరీస్ అంటే కంగారు పడుతుంటారు.
భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ వర్గాల్లో ఎనలేని ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆసీస్ ఆధిపత్యానికి వారి సొంతగడ్డపైనే చెక్ పెట్టిన ఘనత మన సొంతం.. అందుకే కంగారూలు భారత్ తో సిరీస్ అంటే కంగారు పడుతుంటారు. పైగా గత రెండు పర్యాయాలు ఆసీస్ గడ్డపై టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కైవసం చేసుకుంది. గత సీజన్ లో అయితే సీనియర్ ప్లేయర్స్ దూరమైనా కూడా అదరగొట్టింది. ఈ అనుభవం దృష్ట్యానే ఇప్పుడు భారత్ జట్టు పర్యటనకు వస్తుందంటేనే ఆసీస్ లో టెన్షన్ మొదలైంది. అందుకే ఎప్పటిలానే సిరీస్ కు ముందు ఆసీస్ ఆటగాళ్ళు మాటల యుధ్ధం మెదలుపెట్టారు. మాటలతో రెచ్చగొట్టి భారత్ ను దెబ్బతీయాలనే వ్యూహంతో రెడీ అవుతున్నారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ కథ ముగిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్యూలో మాట్లాడిన టిమ్ పైన్ భారత్,ఆసీస్ సిరీస్ పై తన అంచనాలను పంచుకున్నాడు. సొంతగడ్డపై ఎప్పుడూ ఆసీస్ ఫేవరెట్టేనని, ఈ సారి ఖచ్చితంగా తామే సిరీస్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా జైత్రయాత్రకు ఈ సారి తాము బ్రేక్ వేస్తామని వ్యాఖ్యానించాడు. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. బ్యాటింగ్ లోనూ తడబడుతోందనీ, ఆసీస్ పిచ్ లపై ఆడడం ఎప్పుడూ సవాలేనని పైన్ చెప్పుకొచ్చాడు. బౌలింగ్ బూమ్రా ఉన్నప్పటకీ మహ్మద్ షమీ లేకపోవడం భారత జట్టు ఇబ్బందికరమైన పరిస్థితేనని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు బూమ్రాపై అదనపు భారం పడుతుందన్నాడు.
ఈ సారి భారత బ్యాటర్లకు ఆసీస్ పిచ్ లపై కఠినమైన సవాళ్ళు ఎదురుచూస్తున్నాయని పైన్ అంచనా వేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు పీక్ స్టేజ్ లో లేకున్నా సొంతగడ్డపై అనుకూలమైన పరిస్థితుల మధ్య క్వాలిటీ క్రికెట్ ఆడుతుందని విశ్లేషించాడు. అయితే సిరీస్ మాత్రం హోరాహోరీగా సాగుతుందన్న ఈ ఆసీస్ మాజీ సారథి రెండు జట్లకూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లు కీలకమన్నాడు. ఒకవిధంగా ఈ సిరీస్ తో ఫైనల్ రేసు మరింత రసవత్తరంగా మారుతుందని టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగానే భారత్, ఆసీస్ మ్యాచ్ లకు క్రేజ్ ఉంటుందని, టెస్ట్ ఫార్మాట్ లో ఈ మజా మరింత ఎక్కువగా కనిపిస్తుందన్నాడు. ఇక రిషబ్ పంత్ , విరాట్ కోహ్లీ కోసం తమ ప్లాన్స్ తమకున్నాయంటూ వ్యాఖ్యానించాడు.