RTC bus scheme : పురుషులను గౌరవిద్దాం..! వారి సీట్లలో వారినే కూర్చోనిద్దాం..!!

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మగాళ్ళకి తిప్పలు తెచ్చిపెట్టింది. ప్రతి బస్సులో 80శాతానికి పైగా సీట్లను మహిళలే ఆక్రమిస్తున్నారు. డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనుక్కున్న మేము.. నిలబడే ప్రయాణించాలా అని మగాళ్ళు గగ్గోలు పెడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 03:42 PMLast Updated on: Dec 27, 2023 | 3:42 PM

Lets Respect Men Let Them Sit In Their Seats

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మగాళ్ళకి తిప్పలు తెచ్చిపెట్టింది. ప్రతి బస్సులో 80శాతానికి పైగా సీట్లను మహిళలే ఆక్రమిస్తున్నారు. డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనుక్కున్న మేము.. నిలబడే ప్రయాణించాలా అని మగాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అందుకే పురుషులకు బస్సుల్లో 20 సీట్లు కేటాయించాలని TS RTC ఆలోచిస్తోంది. దాంతో గతంలో మహిళలను గౌరవిద్దాం అనే స్లోగన్ కి బదులు.. పురుషులను గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లల్లో వారినే కూర్చోనిద్దాం.. అనే కొత్త స్లోగన్ రాబోతోంది. అదే గనక జరిగితే దేశంలోనే బస్సుల్లో మగాళ్ళకు రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.

ఆర్టీసీ బస్సుల్లో మహిళల సీట్లు రిజర్వేషన్ల స్లోగన్‌ రివర్స్‌ అవబోతోంది. పురుషులకు కోటా రాబోతోంది. ప్రతీ బస్సులో మొత్తం 55 సీట్లు ఉంటాయి. వాటిల్లో 20 సీట్లను పురుషులకు రిజర్వ్‌ చేయాలనే ఆలోచిస్తున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళల ప్రయాణీకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాంతో మగాళ్ళు కూర్చోడానికి సీట్లు దొరకడం లేదు. ఎంత దూరమైనా నిలబడే ప్రయాణించాల్సి వస్తోంది. గతంలో మహిళలకు కేటాయించిన సీట్లల్లో మగాళ్ళను కూర్చోనిచ్చేవారు కాదు. ఒకవేళ సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చున్నా.. మహిళలు రాగానే లేడీస్ రిజర్వేషన్.. లేవాలని డిమాండ్ చేసేవారు. కండక్టర్ కు కంప్లయింట్ కూడా చేసేవారు. కానీ మహిళలకు కేటాయించిన సీట్లు కాకుండా.. పురుషుల సీట్లల్లో వాళ్ళు కూర్చున్నా ఇప్పుడు లేపలేని పరిస్థితి ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ డిస్ట్రీక్ట్ బస్సులతో పాటు సిటీ, సబ్ అర్భన్ సర్వీసుల్లో కూడా మహిళలకు సీట్ల రిజర్వేషన్ అయితే కొనసాగుతోంది.
కానీ తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ అవబోతోంది. ఉచిత ప్రయాణంతో మహిళలే బస్సులో మొత్తం సీట్లు ఆక్రమించడంతో.. పురుషులకు సీట్లు రిజర్వ్ చేయాలని ఆర్టీసీ అధికారులు ఆలోచన చేస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి వివరాలు పంపాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. డిపోల వారీగా నివేదికలు తెప్పించుకున్న తర్వాత.. బస్సులో మగాళ్ళకు ఎన్ని సీట్లు రిజర్వ్‌ చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్‌ చేస్తే మాత్రం.. అది తెలంగాణలోనే ఫస్ట్ అవుతుంది. అయితే ఈ సిస్టమ్ వల్ల మహిళల్లో వ్యతిరేకత వస్తుందా.. మగాళ్ళ ఇగో దెబ్బతింటుందా.. సీట్ల రిజర్వేషన్ ను ప్రభుత్వం ఒప్పుకుంటుందా లాంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటేనే.. పురుషులకు బస్సుల్లో 20 సీట్లు రిజర్వ్ చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. డిపోల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా.. రాబోయే రోజుల్లో పురుషుల కోటాపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అది జరిగితే మహిళలను గౌరవిద్దాం అనే స్లోగన్ కి బదులు.. పురుషులను గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లల్లో వారినే కూర్చోనిద్దాం.. అనే కొత్త స్లోగన్ ను TSRTC బస్సుల్లో రాయాలేమో మరి.