Chandrababu Six guarantees : హామీలకు చంద్రబాబు ఎగనామం పెడతారా…?
ఏపీ ఆర్థిక (AP Finance) పరిస్థితి చూస్తే నాకు భయమేస్తుంది. ఆరు హామీలను ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.
ఏపీ ఆర్థిక (AP Finance) పరిస్థితి చూస్తే నాకు భయమేస్తుంది. ఆరు హామీలను ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఏపీ ముఖ్యమంత్రి (Chief Minister of AP) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అసెంబ్లీలో స్వయంగా చెప్పిన మాటలు ఇవి.. గడిచిన రెండు నెలలుగా ఏపీలో పరిస్థితులు, చంద్రబాబు చెప్పిన మాటలు వింటే ఎన్నికల్లో ఇచ్చిన ఇబ్బడి ముబ్బడి హామీలేవి అంత తేలిగ్గా అమలు అయ్యేటట్లు కనిపించడం లేదు. అందుకే హామీలు నెరవేర్చకపోయినా సర్దుకు పోయేటట్లు ప్రజల మైండ్ ని చంద్రబాబు ముందే ప్రిపేర్ చేస్తున్నారా అని అనిపిస్తోంది.
అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిన ఈ మాటలే ఇప్పుడు జనంలో సందేహాలు రేపుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని, ఖజానాలో రూపాయి లేదని, ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసాడని, ఆరు హామీలు (Six guarantees) ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదని…. జనం అర్థం చేసుకోవాలని ఇలా రకరకాలుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నది ఒకటే. జగన్ ఉచితాలు వలన రాష్ట్రం ఆర్థికంగా కుదేలు అయిపోయిందని, వెనిజులా అయిపోయిందని, శ్రీలంక అయిపోయిందని చెప్పింది మీరే. ప్రచారం చేసింది మీరే. ఇన్ని చెప్పి మీరే జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు, స్కీములు ప్రకటించి ఇప్పుడు డబ్బులు లేవని అంటే ఎలా? 45 ఏళ్ల ఇండస్ట్రీ… చంద్రబాబు నాయుడుకి ఆ మాత్రం ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదా? ఇవన్నీ అసాధ్యమని తెలిసికూడా ఆయన ఎన్నికల్లో ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు? ఇవన్నీ సాధ్యం కావని బిజెపికి కూడా స్పష్టంగా తెలుసు. అందుకే ఆరోజు మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బిజెపి ప్రతినిధి ఇష్టపడలేదు.
ఆ మేనిఫెస్టోలో తమ భాగస్వామ్యం ఉందని ఎక్కడ బిజెపి చెప్పలేదు. ఆరు నూరైనా.. తాను అధికారంలోకి రావాలి అని అనుకున్న చంద్రబాబు అడ్డు అదుపు లేకుండా హామీలు ఇచ్చారు. తన సహజ శైలికి భిన్నంగా అడగనివాడిది పాపం అన్నట్లు, వాగ్దానాలు చేశారు. పథకాలు ప్రకటించారు. నిజానికి ఆ ప్రకటనలు ఏమీ చేయకపోయినా… హామీలు అంత భారీగా ఇవ్వకపోయినా ఏపీలో ఎన్డీఏ కూటమి గెలిచి ఉండేదేమో. జగన్ మీద అంత వ్యతిరేకత ఉంది రాష్ట్రంలో. అయినా ఏ అవకాశాన్ని వదులుకోకూడదని… సంక్షేమ పథకాలు ఉచితాలు విషయంలో జగన్నీ అన్ని మాటలు తిట్టి… తిరిగి అందుకు రెట్టింపు పథకాలను ప్రకటించారు చంద్రబాబు. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక డబ్బులు, ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక, కింద మీద పడుతున్నారు. అందుకే ఇవన్నీ సాధ్యం కాదని ముందే జనాన్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది వృద్ధాప్య పెన్షనర్లు ఉన్నారు. వెనక ముందు చూడకుండా ఒకేసారి వాళ్ళకి వెయ్యి రూపాయలు అదనంగా పెంచేశారు. అలాగే 3000 రూపాయలు బోనస్ కూడా ఇచ్చారు. 65 లక్షల మంది పెన్షనర్లకి ఒక్కొక్కరికి 4000 రూపాయలు చొప్పున 12 నెలలు ఇస్తే…31,200 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ఒక్క స్కీమే చంద్రబాబు సక్రమంగా అమలు చేయగలుగుతారు. మిగిలినవన్నీ కష్టమే. సంపదలు సృష్టించి వాటిని జనానికి సంక్షేమ పథకాలుగా అందిస్తానని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు.
ఈ మాట చెప్పడానికి, వినడానికి చాలా బాగుంటుంది. కానీ సంపదలు సృష్టించడానికి సమయం పడుతుంది, ఈరోజు రాత్రి అనుకుంటే పొద్దునికి సంపదలు రావు. కానీ పథకాలు ఇప్పటికీ ఇప్పుడే ఇవ్వాలి. అందుకే చంద్రబాబు టెన్షన్ పడుతున్నాడు. సూపర్ సిక్స్ తో పాటు మొత్తం 25 హామీలు ఇచ్చారు చంద్రబాబు. అన్ని కాకపోయినా కొన్ని అయినా సరే ప్రతి నెల ఇవ్వాల్సిందే. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, ప్రతి నిరుద్యోగికి నెలకు మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. దీనికి ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది. స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 రూపాయలు ఇవ్వాలి. ప్రతి రైతు ఏడాదికి 20,000 ఇవ్వాలి. ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు ఇవ్వాలి. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే ఐదేళ్లలో 15 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. ఇవన్నీ ఊహించనంత భారం కాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. 65 లక్షల మంది రైతులు ఉన్నారు ఏపీలో.20 వేలు ఒక్కొక్కరికి ఇచ్చినా… ఏడాదికి 13 వేల కోట్లు అవుతుంది. అలాగే నిరుద్యోగులు 20 లక్షల మంది పైగా ఉన్నారు. ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పు నిరుద్యోగ భృతి ఇచ్చినా ఏడాదికి 7,000 కోట్లు అవుతుంది.
ఏపీలో 80 లక్షల మంది స్కూల్ కి వెళ్తున్న పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి 15 వేల చొప్పున ఇస్తే ఏడాదికి 12 వేల కోట్లు అవుతుంది.65 లక్షల మంది వృద్ధ పెన్షనర్లకి నెలకు ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున ఇస్తే….13200 కోట్లు అవుతుంది.18 ఏళ్లు దాటిన ఆడపిల్లలకి నెలకి 1500 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్తే ఏడాదికి 29 వేల కోట్లు అవుతుంది. అలాగే బీసీలకు ప్రత్యేక నిధులు అదో 14 వేల కోట్లు అవుతుంది. హామీలలో లేనివి, నిత్యం అమలు చేయాల్సిన మిడ్ డే మీల్స్, స్కూల్ పిల్లలకు కిట్స్ … ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఆరు హామీలు తో సహా మొత్తం 25 హామీలు ఇచ్చి ఉన్నారు. ఆరు హామీల అమలకే 1,20,000 కోట్లు ఖర్చవుతుంది. ఇవన్నీ తలుచుకుంటే చంద్రబాబుకి గుండె గుబెల్ అంటుంది. కానీ హామీలు ఇచ్చేముందు, వాగ్దానాలు చేసే ముందు ఆలోచించుకోవాలి. లెక్కలు వేసుకోవాలి.
చంద్రబాబు ఇవేమీ తెలియని వాడు కాదు. గెలవడం కోసం ఏదైనా మాట్లాడాలి ఏదైనా చేయాలి అన్న తపన లో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడు, చేతిలో రూపాయి లేదు, జనం ఆలోచించాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కితే… మొదటి ఆరు నెలలు ఎవరు ఏమి మాట్లాడకపోయినా… తర్వాత మాత్రం నిలదీస్తారు. నిజానికి చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్ని జనానికి పూర్తిగా అవసరం లేదు. ఆయన్ని ఎవరు అడగలేదు కూడా. అయినా సరే ఆవేశపడ్డారు ఆయన. మరి వీటన్నిటిని పరిష్కరించి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా… లేక ఎప్పటిలాగే మాటలతో మాయ చేస్తారా అనేది వేచి చూడాలి.