పంత్ పై ముందే మెగాప్లాన్, అసలు కథ చెప్పిన లక్నో ఓనర్
ఐపీఎల్ మెగావేలంలో ఊహించినట్టుగానే రిషబ్ పంత్ రికార్డులు బద్దలుకొట్టాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేయడంతో 2 కోట్ల బేస్ ప్రైస్ తో ఉన్న పంత్ కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి.
ఐపీఎల్ మెగావేలంలో ఊహించినట్టుగానే రిషబ్ పంత్ రికార్డులు బద్దలుకొట్టాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేయడంతో 2 కోట్ల బేస్ ప్రైస్ తో ఉన్న పంత్ కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఒకదశలో 20 కోట్ల దగ్గర బిడ్ ఆగినట్టు కనిపించినా లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా ఏడు కోట్లు ఎక్కువ బిడ్ వేసి 27 కోట్లకు పంత్ ను సొంతం చేసుకుంది. అయితే విభేదాలతోనే ఢిల్లీ నుంచి బయటకు వచ్చేసినట్టు పంత్ చెప్పినప్పటకీ… అతని కోసం ఆ ఫ్రాంచైజీ ఆర్టీఎం ప్రయత్నించడం ఆశ్చర్యపరిచింది. చివరికి లక్నో వేసిన 27 కోట్ల ఫైనల్ బిడ్ తో పక్కకు తప్పుకోక తప్పలేదు. ఇదిలా ఉంటే పంత్ కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడంపై లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా స్పందించాడు.
పంత్ కోసం తాము ఎక్కువగానే ఖర్చు చేశామని ఒప్పుకున్నాడు. అతను 26 కోట్లకే దక్కాల్సిందని, కానీ తాము ఒక కోటీ ఎక్కువగా ఖర్చు చేశామని తెలిపాడు. అయితే ఇందుకు తాము ఏం భాదపడటం లేదని, ప్లాన్ ప్రకారమే పంత్‌ను కొనుగోలు చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. మెగా ఆక్షన్ బ్రేక్ సమయంలో మాట్లాడిన సంజీవ్ గోయెంకా.. పంత్‌ను కొనుగోలు చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. రిషభ్ పంత్.. తమ ఆక్షన్ ప్లాన్‌లో ఉన్నాడని చెప్పాడు. అతను జట్టుకు అన్ని విధాల ఉపయోగపడతాడనీ, మంచి కెప్టెన్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ గానూ రాణిస్తున్నాడన్నాడు. క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే ఫినిషర్ గానూ పంత్ జట్టుకు ఎంతో అడ్వాంటేజ్ అవుతాడని లక్నో ఓనర్ చెప్పుకొచ్చాడు. అందుకే ధర ఎక్కువైనా పంత్‌ను కొనుగోలు చేశామని తమ ప్లాన్ ను వివరించాడు. అతని కుమారుడు సస్వాత్ గోయెంకా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆర్‌టీఎమ్ కార్డుతో పంత్ చేజారవద్దనే 27 కోట్ల భారీ ధరకు బిడ్ వేసామని స్పష్టం చేశాడు.
ఇదిలా ఉంటే గత ఏడాది సీజన్ సమయంలో లక్నో కెప్టెన్ రాహుల్ ను సంజీవ్ గోయెంకా గ్రౌండ్ లోనే తిట్టడం వైరల్ గా మారింది. అప్పటి నుంచి రాహుల్ తో విభేదాలు తలెత్తడం, అతన్ని రిటైన్ చేసుకోకపోవడంతో లక్నో కొత్త కెప్టెన్ కోసం వేలం బరిలోకి దిగింది. ఊహించినట్టుగానే పంత్ ను భారీ ధరతో సొంతం చేసుకుంది. ఇన్నాళ్ళూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని రిషబ్ పంత్ నడిపించగా.. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కి గత రెండేళ్ల నుంచి కేఎల్ రాహుల్ సారథిగా ఉన్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ కెప్టెన్ లక్నోకి.. లక్నో కెప్టెన్ ఢిల్లీకి మారారు. రెండు ఫ్రాంఛైజీలు జస్ట్ కెప్టెన్లని మార్చుకున్నాయంతే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.