Odisha: పోలీసుల సమక్షంలో భార్యదానం చేసిన భర్త..!
సాధారణంగా వస్త్రదానం, భూదానం, కన్యాదానం అనే మాటలు విని ఉంటారు. మరి ఇదేంటి వింతగా భార్యదానం అని మీలో సందేహం కలుగవచ్చు. అయితే ఈ పూర్తి వివరాలు చదివేయండి.

Madhav Pradhan gave his wife Jilli to a man named Parameshwara Pradhan and got married
ఈమధ్య కాలంలో భార్యలు ఇతరుల ప్రేమకు దాసోహమై ఇళ్లు విడిచి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో తనకు భర్త ఉన్నాడన్న స్పృహ కోల్పోతున్నారు. అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడిచిన భర్తను కూడా లెక్క చేయకుండా తమకు తోచినట్లు ప్రవర్తిస్తున్నారు. పెళ్లి తరువాత మరో కొత్త ప్రియుడితో కలిసుండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ దేశాల మధ్య జరిగిన విషయం మనకు తెలిసినదే. అయితే తాజాగా దేశ సరిహద్దులకు లోబడి జరగడం గమనించవలసిన అంశం. ఇందులో మరో ప్రత్యేకత ఉంది. ఒకరిని పెళ్లి చేసుకొని కొంత కాలం తరువాత ప్రియుడి వద్దకు వెళ్లి పోయిన తన భార్యని ఒక్కమాట కూడా అనకుండా అతనికే ఇచ్చి పెళ్లి జరిపించడం చర్చనీయాంశంగా మారింది.
మాధవ్ ప్రధాన్ అనే భర్త, తన భార్యకు పరమేశ్వర ప్రధాన్ అనే ప్రియుడు ఉన్నాడన్న విషయం తెలుసుకొని వారిద్దరికీ పెళ్లి జరిపించారు. ఈ సంఘటన ఒడిశా సోన్ పూర్ జిల్లాలోని శుభలాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాధవ్ కిరాసి గ్రామానికి చెందినవాడు. మూడు సంవత్సరాల క్రితమే అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లిని పరిణయమాడాడు. గత కొంత కాలంగా జిల్లి తన దూరపు బంధువైన పరమేశ్వర ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. గురువారం తన భార్య అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మాధవ్. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు అతని భార్యతోపాటూ పరమేశ్వర ప్రధాన్ ను కూడా స్టేషన్ కు తీసుకువచ్చారు.
ఇప్పుడే అసలైన ఘట్టం చోటు చేసుకుంది. పోలీసు అధికారి మాధవ్ భార్య జిల్లిని ఎందుకు అతనితో వెళ్లావు అని ప్రశ్నించారు. నేను పరమేశ్వర ప్రధాన్ తో ఉంటాను. అతనినే పెళ్లి చేసుకుంటాను అని స్టేషన్ అధికారితో చెప్పేసరికి ఈ సమాధానం విని అందరూ షాక్ అయ్యారు. ఈ విషయాన్ని జిల్లి భర్త అయిన మాధవ్ ప్రధాన్ కి వివరించారు పోలీసులు. చివరకు జిల్లి భర్త పరమేశ్వర ప్రధాన్ తో వివాహం చేసేందుకు అంగీకారం తెలిపారు. చివరకు పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి మాధవ్ సమక్షంలోనే జిల్లి, పరమేశ్వర్ ల పెళ్లి జరిపించారు.
T.V.SRIKAR