Harish Rao: హరీష్‌ను టార్గెట్ చేసిన మైనంపల్లి.. మెదక్ జిల్లాలో మాస్టర్ ప్లాన్
హరీష్ రావు మీద ఘాటు వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. కాంగ్రెస్‌లో చేరారు.

Mainam Palli Hanumantha Rao made sensational comments on Minister Harish Rao
హరీష్ రావు మీద ఘాటు వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ ప్రకటించిన 115మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉన్నా.. తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించకపోవడంపై మైనంపల్లి అలకపాన్పు ఎక్కారు. ఆ కోపంతోనే బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ టికెట్ల ప్రకటనకు ముందు రోజే.. మంత్రి హరీష్ రావుపై సంచలన విమర్శలు చేశారు మైనంపల్లి. బీఆర్‌ఎస్‌లో తనకు ఇబ్బందికర పరిస్థితులు రావడానికి కారణం.. హరీష్ రావేనని భావించిన మైనంపల్లి.. కారు పార్టీకి దూరంగా జరిగారు. హరీష్ పేరు ఎత్తితే చాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్న మైనంపల్లి.. రాబోయే రోజుల్లోనూ ఆయన టార్గెట్‌గా ప్లాన్లు సిద్ధం చేయబోతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కాంగ్రెస్ గూటికి చేరిన మైనంపల్లి.. హరీష్ రావ్ టార్గెట్‌గా మెదక్ జిల్లా బాధ్యతలు తీసుకున్నారు.
బీఆర్ఎస్‌కు గట్టి పట్టు ఉన్న ఈ జిల్లాపై.. మైనంపల్లి ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు. రామాయంపేటకు చెందిన మైనంపల్లి.. గతంలో టీడీపీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మల్కాజ్‌గిరికి మారారు. ఇప్పుడు తన కుమారుడి కోసం మెదక్ మీద మళ్లీ నజర్ పెట్టారు. మెదక్ సొంత జిల్లా కావడంతో పాటు.. అక్కడ క్షేత్రస్థాయిలో గట్టి పట్టు ఉండడంతో.. మెదక్‌తో పాటు నరసాపూర్ నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా కార్యక్రమాలు చేస్తున్నారు. మైనంపల్లి ఫౌండేషన్ పేరుతో అనేకమందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రతీ గ్రామంలోనూ పెద్ద ఎత్తున అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం.. జనాలకు వైద్య విద్య అవసరాల కోసం మైనంపల్లి సాయం చేస్తూ ఉంటారు. ఇదంతా రాబోయే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని మైనంపల్లి ఆశలు పెట్టుకున్నారు. దీంతో తగ్గేదే లే అన్నట్లుగా దూకుడు చూపిస్తున్నారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు ఎప్పటినుంచో అన్ని వ్యవహారాలు చూస్తున్నారు. హరీష్ మీద కోపంతోనే.. కాంగ్రెస్ తరఫున మెదక్ జిల్లా బాధ్యతలు ఎత్తుకున్నారు. ఎలాగైనా సరే హరీష్ ప్రభావాన్ని తగ్గించి.. తన సత్తా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యారు మైనంపల్లి.