Mynampalli: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లోకి మైనంపల్లి.. టికెట్ల విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం
మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. తనతో పాటూ కొడుకు టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మైనంపల్లి హనుమంత రావు గతంలో కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో బీఆర్ఎస్ వెనుకడుగు వేసింది. దీంతో ఆయన కేసీఆర్ టీం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. మైనంపల్లి రాజీనామా పై కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.
మల్కాజ్ గిరి, మెదక్ సీట్లపై కుదిరిన ఒప్పందం..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి ఇంటికి వెళ్లి తమ పార్టీలో చేరాలని అడుగుతున్నారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటూ మధూయాష్కీ, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ తదితరులు హనుమంతరావు ఇంటికి చేరుకున్నారు. తన ఎమ్మెల్యే టికెట్ తో పాటూ కొడుకు టికెట్ పై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ పెద్దలు అంగీకరించారని సమాచారం. మల్కాజ్ గిరి, మెదక్ రెండు సీట్ల పై స్పష్టమైన ఒప్పందంతోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమైయ్యారని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈయనతోపాటూ తన నియోజకవర్గ పరిధిలోని నలుగురు కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్దమైయ్యారని చెబుతున్నారు మైనం పల్లి వర్గేయులు.
ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
ఈనెల 27న ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం కాంగ్రెస్ కీలక నేతలు ఈయన ఇంటికి వెళ్ళినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. పొంగులేటి, జూపల్లి, తుమ్మల వంటి సీనియర్ నాయకులకుల జాబితాలో ఇప్పుడు మైనంపల్లి చేరబోతున్నారు. అయితే గెలుపు సాధ్యమా అనే అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతున్నాయి.
T.V.SRIKAR